RGV--(Ram-Gopal-Varma)-Controversy-with-Kamma-Rajyamlo-Kadapa-Redlu వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు. ఎన్నికల ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాతో టీడీపీని ఇబ్బంది పెట్టిన ఆయన తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరిట మరో వివాదాస్పద చిత్రంతో ముందుకు వచ్చారు. ఆ సినిమాకు సంబందించిన ట్రైలర్ నిన్న దీపావళి సందర్భంగా విడుదల చేశారు.

అనుకున్నట్టుగానే చంద్రబాబుని, లోకేష్ ని అత్యంత వివాదాస్పదంగా చూపెట్టారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ స్పందించలేదు. టీడీపీ కంటే కాంగ్రెస్ పార్టీ నుండి స్పందన రావడం విశేషం. ఎప్పటిలానే స్పందిస్తే ఎక్కువ ప్రచారం కలిపించినట్టు అవుతుందని చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టుగా ఉంది.

అయితే సినిమా టైటిల్, కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ను నిషేధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందన్నారు.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని.. కులాల పేర కాదని లేఖలో తెలిపారు. రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమా ప్రకటించిన నాటి నుండీ చాలా మంది అభిప్రాయం ఇదే. దీనిపై పోలీసులు, న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.