rgv-lakshmis-ntr-2రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్ విడుదలపై అనిశ్చితి కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు సినిమా రిలీజ్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్‌ బోర్డ్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వటంతో ఇక రిలీజ్ కు లైన్‌క్లియర్‌ అని భావించారు అంతా. అయితే తాజాగా ఈ సినిమాపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో మరో రెండు పిటీషన్లు వేశారు తెలుగుదేశం నాయకులు. సెన్సార్‌ బోర్డు అనుమతులు ఇవ్వకుండా ఉండాల్సింది అని ఒక పిటీషన్‌. దానితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు పూర్తయ్యే వరకు లక్ష్మీస్‌ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా వేయాలంటూ మరో పిటీషన్ దాఖలైంది.

ఈ రెండు పిటీషన్ల విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. దీనితో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ అనిశ్చితి కారణంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు చేసారు నిర్మాతలు. మరోవైపు ఈ సినిమాకు అనుకూలమైన తీర్పు వచ్చినా సినిమా విడుదలకు ఆంధ్రలోని థియేటర్ ఓనర్లకు పెద్దగా ఇంట్రస్టు లేదు. సినిమాను తమ థియేటర్లలో వేస్తే తెలుగు తమ్ముళ్ళతో ఇబ్బంది అవుతుందని వారు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పోలీసులు కూడా టీడీపీ వారికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీనితో వారు సినిమా వెయ్యడానికి వెనుకాడుతున్నారు. తెలంగాణాలో మాత్రం అక్కడి ప్రభుత్వ సహకారంతో అక్కడి థియేటర్ ఓనర్లు సినిమాను ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నారు. ఒకవేళ ఈ ఇబ్బందులన్నీ అధిగమించి సినిమా విడుదలైన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలోని ట్యాలెంట్ వల్ల ఆడుతుంది అనే నమ్మకం ఎవరికీ లేదు. అయితే ఈ వివాదాస్పద దర్శకుడి సినిమా ఏదైనా ఈ మధ్య కాలంలో ఈ మాత్రమైన ప్రజల నోళ్ళలో నానింది అంటే ఇదే. అది కూడా వివాదాస్పద సబ్జెక్టు కావడం వల్ల.