Rewanth can you stand or Will  become a puppetతెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజుకో తీరుగా మారుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చి రాగానే తనకున్న ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారనే చెప్పాలి. కానీ దీనిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాత్రం వెనక్కి లాగుతుండడం విస్తుపోయే అంశంగా మారింది.

ఒకరోజు కోమటిరెడ్డి, మరోనాడు జగ్గారెడ్డి, ఇంకో రోజు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ వంటి సీనియర్లు కాంగ్రెస్ లో రేవంత్ ఎదుగుదలను అడ్డుకుంటున్నారనేది ఓ వాదన. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు జీవితాన్ని సైతం చవిచూసిన రేవంత్ రెడ్డి, అనతి కాలంలోనే కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించి, రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చున్నారు. మరో వైపు తెలంగాణా ఇచ్చిన పార్టీగా తమకు దక్కాల్సిన హోదా దక్కలేదనే నిరాశలో ఉన్న కాంగ్రెస్ కు రేవంత్ రూపంలో ఓ చక్కటి అవకాశం చిక్కినట్లయ్యింది.

అందుకు తగ్గట్టుగానే రేవంత్ ద్వారా పార్టీని నిత్యం ప్రజలలో ఉంచే కార్యక్రమాలు చేస్తుంటే, పార్టీ సీనియర్లు మాత్రం “తాము చేయరు… సహచరులను చేయనివ్వరు” అన్న చందంగా రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ‘పూటకో మాట – రోజుకో ఫిర్యాదు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కారణాల వల్లే మూడవ స్థానంలో ఉన్న బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది అనే వాదన తెలంగాణాలో బలంగా వినిపిస్తోంది.

పార్టీ బలోపేతం కన్నా, వ్యక్తిగత ప్రాధాన్యతకే మొగ్గు చూపే నేతలకు ఇప్పుడు ప్రజలలో కాలం చెల్లిందని, ఎన్నో ఎన్నికల ఫలితాలు రుజువు చేసాయి. అయినా మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కళ్ళు తెరచి వాస్తవానికి రాలేకపోవడం కాస్త విచిత్రంగానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జగ్గారెడ్డి లాంటి సీనియర్లు బహిరంగంగానే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తిని., కనీసం ఆ పదవికైనా గౌరవం ఇవ్వకుండా విమర్శిస్తుంటే చర్యలు తీసుకోవటానికి ఇంత సమయం పట్టిందా? అంటున్నారు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కాంక్షించేవారు.

రేవంత్ రెడ్డి కూడా ఇటువంటి అంతర్గత రాజకీయాలను తట్టుకొని తానూ నిలదొక్కుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో నిలబెడతారో లేక అందరి లీడర్ల మాదిరే కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారతారో చూడాలని రేవంత్ అభిమానులతో పాటు అధికార పార్టీ వ్యతిరేకులు ఎదురు చూస్తున్నారు.