Revenue officials destroy Sye Raa Narasimha Reddy setsమెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న “సైరా నరసింహారెడ్డి” సినిమా సెట్టింగును కూల్చివేసిన ఘటనలో వివాదం ముదురుతోంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా సెట్ వేసినందుకు కూల్చివేశామని అధికారులు చెబుతుండగా, ఆ స్థలానికి సంబంధించి తాము ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి అనుమతి తీసుకున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇది ప్రభుత్వ స్థలమైతే ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతి ఎలా తీసుకుంటారంటూ అధికారులు వాదిస్తున్నారు.

ప్రస్తుతం కూల్చివేసిన సెట్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాకు వేసినది. ఇందులోనే ‘సైరా’ షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ గుట్టలబేగంపేట ప్రాంతంలో ఈ సెట్ వేశారు. తాజాగా ‘సైరా’ సినిమాను కూడా అదే సెట్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. పలుమార్లు కోరినా స్పందించకపోవడంతో మంగళవారం సెట్‌ను బుల్డోజర్ సాయంతో కూల్చివేశారు.

ఈ ఘటనపై తహసీల్దార్ తిరుపతిరావు మాట్లాడుతూ… సెట్టింగ్ తొలగించి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని తాను స్వయంగా పలుమార్లు సూచించినప్పటికీ చిత్ర యూనిట్ లక్ష్య పెట్టలేదని తెలిపారు. కలెక్టర్ అనుమతితో షూటింగ్ చేసుకుని ఉంటే తమకు అభ్యంతరం ఉండేది కాదని, ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు వ్యక్తి నుంచి అనుమతి తీసుకున్నామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇది పరోక్షంగా భూకబ్జాకు ప్రోత్సహించడమే అవుతుందని, అందుకనే సెట్‌ను పాక్షికంగా కూల్చివేసినట్టు తిరుపతిరావు వివరించారు.