Revanth Reddy resigned to MLAసీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు పేలుస్తూ, ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్‌రెడ్డి టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పేశారు. ఇక ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా తన మార్గాన్ని సుగమం చేసుకున్నారని, ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

పార్టీతో పాటు ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ దానిని ఆమోదిస్తే వచ్చే 6నెలల్లో ఎప్పుడైనా ఉపఎన్నిక రావొచ్చు. ఈ ఎన్నికల సందర్భంగా కూడా రేవంత్‌ను ఓడించడానికి టీఆర్‌ఎస్‌ శతవిధాల ప్రయత్నించబోతుంది. అధికార పక్షాన్ని తట్టుకొని గెలిస్తే కేసీఆర్ కు సరైన నాయకుడుగా రేవంత్ ఎదుగుతాడు.

ఒకవేళ ఓడిపోతే తన ఆశలకు కళ్ళెం పడినట్టే. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను పట్టించుకునే పరిస్తితి కూడా ఉండదు. కాబట్టి ఇది రేవంత్కు జీవన మరణ సమస్య. ఐతే ఈ పరిస్తితి ఆయన కావాలని కొని తెచ్చుకున్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలన అంతానికి కంకణం కట్టుకున్న రేవంత్మొండివాడు రాజుకంటే బలవంతుడు అని నిరూపిస్తాడా?

ఉపఎన్నిక వస్తే ఆయనపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నరేందర్‌రెడ్డి కాకుంటే మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని బరిలో దింపవచ్చు. ఆయన 2009, 2014 ఎన్నికల్లో రేవంత్ చేతిలో ఓడిపోయారు.