Revanth reddy Jana Jataraటీడీపీ ఫైర్ బ్రాండ్, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ‘ఓటుకు నోటు కేసు’లో రేవంత్ రెడ్డి ఇప్పటికే నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఈ కేసులో ఓ నెల రోజుల పాటు జైలు జీవితం కూడా చవిచూశారు. తాజాగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి జేఏసీ నిర్వహించిన జన జాతరకు హైకోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన విద్యార్థి జేఏసీ సాయంత్రం నుంచి రాత్రి దాకా ‘జనజాతర’ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.

అయితే, హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల నేతలు చెరకు సుధాకర్, యెన్నం శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, కార్యక్రమ నిర్వాహకులపైన కూడా పోలీస్ కేసులు నమోదు అయ్యాయి.