Congress-to-field-Revanth-Reddy-in-Parliament-Electionsతెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. కొన్ని రోజులు ఆగితే ఎవరు ఏ పార్టీ అనేది కూడా తెలియడం కష్టమేమో? తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ చేసిన నాటి నుండి రేవంత్ రెడ్డి ఆయనకు పంటికింద రాయిగా పరిణమించారు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకుని రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించి జైలుకు పంపించారు. అయితే దానితో రేవంత్ రెడ్డి మరింత రెచ్చిపోయారు. కేసీఆర్ ను ఆయన బాషలోనే అమ్మనా బూతులు తిట్టేవారు.

కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. అయితే మరో సారి రేవంత్ అడ్డు తొలగించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొడంగల్ లో ఆయనను ఓడించారు. ఎన్నికల ముందుకు కూడా రేవంత్ పై ఎన్నో కేసులు దాడులు… ఒక్క కొడంగల్ లోనే తెరాస 200 కోట్లు ఖర్చు పెట్టిందని రాజకీయ వర్గాలలో ఒక టాక్. ఓడిపోయిన తరువాత రేవంత్ అస్త్ర సన్యాసం చేశారు. రెండు మూడు ఏళ్ల పాటు అసలు మీడియాతో కూడా మాట్లాడనని చెప్పేశారు.

అయితే ఇప్పుడు ఏకంగా ఇంకో వార్త హుల్ చల్ చేస్తుంది. రేవంత్ వస్తా అంటే ఆయనను కూడా చేర్చుకోవడానికి తాము సిద్ధమని తెరాస భేరాలకు దిగిందంట. మర్చిలో ఖాళి అవ్వబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక పదవి ఇస్తామని ఆఫర్ చేశాయట. ప్రస్తుతం తెలంగాణాలో తెరాసకు పక్క పార్టీల వారి అవసరం లేకపోయినా ప్రతిపక్షాన్ని ఖాళీ చెయ్యడమే ధ్యేయంగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితి. మరీ ముఖ్యమంత్రిని ఎడాపెడా తిట్టేసిన రేవంత్ ను కూడా పార్టీలోకి తీసుకెళ్ళి పదవి ఇస్తే చూసే వారు ఏమనుకుంటారో అని కూడా లేకపోవడం తాజా రాజకీయం.

మరో వైపు దీని మీద రేవంత్ రెడ్డి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగితే మాత్రం వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చెయ్యాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. మహబూబ్ నగర్ గానీ మల్కాజ్ గిరి పార్లమెంట్ నుండి గానీ పోటీ చెయ్యడానికి ఆయన ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. రేవంత్ తెరాసలో చేరడం అంటూ జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పని కూడా అయిపోయినట్టే. ఇప్పటికే ఆ పార్టీ మాస్ లీడర్ల కొరత తో ఇబ్బంది పడుతుంది. రేవంత్ వెళ్ళిపోతే పార్లమెంట్ ఎన్నికల ముందు శ్రేణుల మనోధైర్యం పూర్తిగా దెబ్బ తింటుంది.