Revanth Reddy GHMC Electionsతెలంగాణ ఏర్పడిన నాటి నుండీ కేసీఆర్ మీద సవాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఓటుకు నోటు కేసు ద్వారా తన స్పీడ్ కు బ్రేక్ పడింది. 2018 ఎన్నికలలో సొంత ఇలాకాలో ఓడిపోవడంతో రేవంత్ పని అయిపోయినట్టే అనుకున్నారు అంతా. అయితే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానంలో నిల్చుని సునాయాసంగా గెలిచారు ఆయన.

దీనితో మళ్ళీ కేసీఆర్ కుటుంబంపై తన దండయాత్ర మొదలుపెట్టారు. అయితే మూలన పడిన కాంగ్రెస్ కు జాకీలు వెయ్యడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అయితే కరోనా సమయంలో కేసీఆర్ పాలన మీద ఎప్పుడూ లేనంతగా ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఎక్కువగా చదువుకున్న వారు ఉండే జీహెచ్ఎంసిలో మరింత ఎక్కువగా ఉంది.

ఈ తరుణంలో ముంచుకొస్తున్న జీహెచ్ఎంసి ఎన్నికలను తన అనుకూలంగా వాడుకోవాలని రేవంత్ భావిస్తున్నాడు. జీహెచ్ఎంసిలోని 150 డివిజన్లలో 50 ఎంఐఎం ఇలాకాలో ఉన్నాయి… రేవంత్ లోక్‌ సభ పరిధిలోనికి వచ్చే 48 డివిజన్లలో తన సత్తా చూపించి మిగతా వందలో కొంత మేర పోటీ ఇవ్వగలిగిన కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకోవచ్చని రేవంత్ అనుకుంటున్నారు.

ఈ తరుణంలో తన లోక్‌ సభ పరిధిలోనికి వచ్చే 48 డివిజన్లలో యాత్ర చేపట్టి పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. ఈ 48 డివిజన్లలో గణనీయమైన స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే కాంగ్రెస్ పీసీసీ బాధ్యతలు కూడా రేవంత్ కే అప్పగించే అవకాశం ఉంది. చూడాలి రేవంత్ కల నెరవేరుతుందో లేదో!