revanth-reddy-congress-vs-kcr-trsతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్యంగా తన కంచుకోట కొడంగల్ లో ఓడిపోయారు. తనకు కొరకరాని కొయ్యగా తయారయిన రేవంత్ ను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం హరీష్ రావుని స్వయంగా దించి ఆకాశమే హద్దుగా ఖర్చు పెట్టి మొత్తానికి ఆ నియోజకవర్గంలో గులాబీ జండా ఎగురవేశారు. అయితే ఇంతటితో ఆగిపోకుండా రేవంత్ ను ఎలాగైనా రాజకీయంగా సమాధి చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారట. శత్రుశేషం అనేది లేకుండా చెయ్యడం కేసీఆర్ ఉద్దేశం.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పై గెలిచిన పట్నం నరేంద్రను తన క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందట. తెలంగాణాలో ప్రముఖ నేతైన పట్నం మహేంద్ర రెడ్డి సోదరుడు ఆయన. అయితే మహేందర్ రెడ్డి తాండూరు నుండి అనూహ్యంగా ఈ ఎన్నికలలో ఓడిపోయారు. తొలుత ఆయనను ఎమ్మెల్సీ గా చేసి క్యాబినెట్ లోకి తీసుకోవాలి అనుకున్నా ఇప్పుడు ఆయన స్థానంలో పట్నం నరేంద్రను క్యాబినెట్ లోకి తీసుకుంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.

స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయితే వచ్చే ఎన్నికలలో కూడా ఆయనను గెలిపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా వచ్చే ఐదు సంవత్సరాలలో కొడంగల్ లో అభివృద్ధి చేసి మళ్ళీ ఇక్కడ నుండి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే తమకు ఇబ్బంది అని ఆ నియోజకవర్గం ప్రజలతో అనిపించాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. ఇప్పటికే సొంత ఓటమి, కాంగ్రెస్ ఓటమితో కుదేల్ అయిన రేవంత్ రెడ్డి ఈ పరిణామాలను ఎలా వదులుకుంటారో చూడాలి. ఏది ఏమైనా వచ్చే ఐదు ఏళ్ళు రేవంత్ రెడ్డికి గడ్డు కాలం అనుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు.