Revanth Reddy leaving congress partyప్రస్తుతం చర్చ అంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించే నడుస్తుంది. అయితే తెలంగాణాలో కూడా ఎన్నికలు జరిగాయి అనే విషయమే చాలా మంది మర్చిపోయారు. 2018 డిసెంబర్ లో కేసీఆర్ కొట్టిన దెబ్బ అటువంటిది మరి. ఇప్పుడు తెలంగాణాలో ఇంకో పార్టీ గెలుస్తుంది అనేది కూడా చెప్పడానికి వీలు లేని పరిస్థితి. సర్వే ఏజెన్సీలు కూడా మనకెందుకులే అనుకుని తెరాసకు క్లీన్ స్వీప్ చెప్పేస్తున్నారు. వాస్తవ పరిస్థితిలు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.

ఇటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ఎక్కడో కొడంగల్ నుండి వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేశారు. కొడంగల్ ఓటమి ఇంకా జీర్ణించుకోకముందే మళ్ళీ ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి. కొడంగల్ లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అని కేటీఆర్ ఆయనను పలుమార్లు ఎద్దేవా కూడా చేశారు. మల్కాజ్గిరిలో ఆంధ్రకు చెందిన సెట్లర్లు గట్టెక్కిస్తారు అనుకుంటే వారంతా ఓటు వెయ్యడానికి ఆంధ్ర వెళ్లిపోయారు. దీనితో రెండు లక్షలకు తగ్గకుండా ఓట్లతో తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధిస్తారని తెరాస వర్గాల అంచనా.

అదే జరిగితే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇబ్బందే. అసలు కాంగ్రెస్ మీద ఆ పార్టీ శ్రేణులకు గానీ ఓటర్లకు గానీ కనీస నమ్మకం లేని టైమ్ లో పోటీ చెయ్యడం అతిపెద్ద సాహసం. అసలు ఏ లెక్కతో రేవంత్ రెడ్డి అటువంటి నిర్ణయం తీసుకున్నారో అర్ధం కాని విషయం. ఈ ఓటమితో ఆయన పరపతి మరింత పలచన అవుతుంది. పాత కేసులు తిరగదోడితే రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారుతుంది. మే 23న కాంగ్రెస్ లో ప్రకంపనలు వస్తాయో లేక ఖాతా ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుందో చూడాలి.