Revanth Reddy coming to Telangana Congressతెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయనున్నారని వార్తలు వస్తున్న వేళ, ఆయన వెంట కాంగ్రెస్ లో చేరనున్న వారి పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నేతలు రేవంత్ ను అనుసరించనున్నారని, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వారిలోనూ పరువురు రేవంత్ వెంటే నడవనున్నారని తెలుస్తోంది.

మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు బోడ జనార్దన్, ఆదిలాబాద్ అధ్యక్షుడు సోయం బాపూరావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైనట్టు తెలుస్తుండగా, నిర్మల్, కొమరం భీం జిల్లాల అధ్యక్షులు శ్యామ్ సుందర్, జి.ఆనంద్ లు మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలైన జి.బుచ్చిలింగం, ఆనంద్, కోరిపల్లి భూషణ్ రెడ్డి, ప్రకాష్ లడ్డా తదితరులు ఎటువైపు వెళతారన్నది తేలాల్సి వుంది.

కాగా, రేవంత్ వెంట కాంగ్రెస్ లోకి చేరే వారంతా తదుపరి ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటును ఖరారు చేసుకున్న తరువాతనే పార్టీ మార్పు మీద ఓ నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రేవంత్ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చావు దెబ్బపడినట్టేనని, కాంగ్రెస్ కు కొత్త ఊపిరి లభించినట్టని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాను పార్టీని వీడడం లేదని రేవంత్ రెడ్డి ఓ పక్కన చెప్తుండగా, మరో వైపు తమ పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేవారు తప్పకుండా తమ పార్టీలోకి వచ్చి తీరుతారని, రాజకీయంగా పరిపక్వత ఉన్నవారు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

అయితే, పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా గతంలో పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్టు చెప్పి మరీ రావాల్సి ఉంటుందని శాసనమండలి కాంగ్రెస్ ఉప నేత పొంగులేటి సుధాకర్ తేల్చి చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని, తన వ్యాఖ్యలను సవరించుకుంటూ గతంలో రాజీవ్‌ను ఉరి తీయాలని అన్న వారే ఆ తర్వాత పార్టీలో ఉన్నత పదవులు అందుకున్నారని గుర్తు చేశారు.

మొత్తానికి టీడీపీ నేత రేవంత్ కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్న వార్తలతో ఆ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా యువనేతలు జోష్ తో కనబడుతున్నారు. కొందరైతే రేవంత్ అప్పుడే కాంగ్రెస్‌లోకి వచ్చేసినట్టు బ్యానర్లు కూడా కట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాకతో పార్టీలోని యువతకు సరైన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.