YS Jagan-YSRCPఅధికారంలో ఉన్నప్పుడు ‘మా అంతటివారు లేరు… ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే…’ భ్రమలో రాజకీయ నాయకులు ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ పార్టీలు మళ్ళీ రాజరిక వ్యవస్థను నెలకొల్పేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా, వాటి కంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలమైనది కావడంతో ఐదేళ్ళవగానే అందరూ చేతులు జోడిస్తూ మళ్ళీ ప్రజల ముందుకు రాక తప్పడం లేదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హవా నడుస్తోంది కనుక ఆ పార్టీ నేతలు కూడా అదే భ్రమతో ఉంటూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపికి చెందిన నేతలు, కార్యకర్తలతో చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు.

మొన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో తుమ్మపూడి వెళ్ళినప్పుడు ఆయనపైనే వైసీపీ కార్యకర్తలు రాళ్ళతో దాడి చేయడమే ఇందుకు తాజా నిదర్శనం.

ఇటీవల పల్నాడు జిల్లా దాచేపల్లిలో టిడిపి కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం మరో ఉదాహరణ.

ఈ ఘటనలపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చేన్నాయుడు స్పందిస్తూ, “మా అధినేత చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళితే మహిళా కమీషన్‌ నోటీసులు పంపిస్తుంది. మా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడులు చేస్తారు. టిడిపి కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి వారి కుటుంబాలను భయబ్రాంతులు చేస్తుంటారు. అయినా పోలీసులు వారిపై చర్యలు తీసుకోరు. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తుంటే డిజిపి ఏమీ పట్టన్నట్లు చూస్తుండిపోతారు.

ఇప్పుడు వైసీపీ అధినేతలు రెచ్చిపోతే మేము అధికారంలోకి రాగాఏ అందరికీ తప్పకుండా రిటర్న్ గిఫ్టులు అందజేస్తాం. మాపై దాడులు జరుగుతున్నా పోలీసులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇపుడు మమ్మల్ని వేదిస్తున్న ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ అందిస్తాము. కనుక అవి వద్దనుకొనేవారు కనీస ఇప్పటి నుంచైనా తమ బాధ్యతలను సక్రమంగా నిష్పక్షపాతంగా నిర్వర్తిచాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని సున్నితంగా హెచ్చరించారు.