Republic_Day_Parade_New_Delhi_2023నేడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ త్రివర్ణ పతాకం ఎగురవేసి, పోలీస్, సాయుధ దళాల గౌరవవందనం స్వీరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలని ఉద్దేశ్యించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఆనవాయితీ ప్రకారం ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’ పేరిట జరిగే విందు నిర్వహిస్తారు. ఈ విందుకి అధికార, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు హాజరవుతారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై హైకోర్టు కలుగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించడంతో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించింది. హైకోర్టు ఆదేశం మేరకు పోలీస్ బృందాలతో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించినప్పటికీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో విభేధిస్తున్న కారణంగా సిఎం కేసీఆర్‌, మంత్రులు ఎవరూ ఈ వేడుకలకి హాజరుకాలేదు. ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజని కుమార్‌ తదితరులు మాత్రం హాజరయ్యారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ త్రివర్ణ పతాకం ఎగురవేసి, పోలీస్ బృందాల గౌరవవందనం స్వీకరించారు. ఆమె తన ప్రసంగంలో సిఎం కేసీఆర్‌కి సున్నితంగా చురకలు వేశారు. ఆమె పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు కనుక హైదరాబాద్‌లో గణతంత్ర వేడుకలు ముగియగానే ఆమె సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి బయలుదేరి వెళ్లారు. అక్కడ వేడుకలు పూర్తికాగానే హైదరాబాద్‌ చేరుకొని ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’ విందు నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకే హాజరుకాని సిఎం కేసీఆర్‌ ఆ విందుకి హాజరవుతారనుకోలేము.

ఢిల్లీలో ఎప్పటిలాగే చాలా అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్రివిద దళాలల గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసిని ముఖ్య అతిధిగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ వేడుకలలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, అధికార, ప్రతిపక్ష ఎంపీలు, వివిద పార్టీల నేతలు, ఉన్నతాధికారులు, వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. ఈసారి రిపబ్లిక్ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ‘కోనసీమ ప్రభలు’ శకటం పాల్గొంటోంది.