report on amit shah tirupati convoy attackభాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తిరుపతిలో అలజడి రేపింది. నిన్న స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ ఏం జరిగింది అనే దానిపై ముఖ్యమంత్రి నివేదిక తెప్పించుకున్నారు.

దాని ప్రకారం అమిత్ షా వచ్చారు అని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలతో, అమిత్ షా గో బ్యాక్, వీ వాంట్ జస్టిస్ లాంటి నినాదాలతో హోరెత్తించారు. అమిత్ షా కాన్వాయ్ లోని కొన్ని కార్లు వెళ్ళిపోయాక, వెనుక వస్తున్న స్థానిక బీజేపీ కార్యకర్తలు టీడీపీ వారి నినాదాలతో ఆగ్రహంతో ఊగిపోయారు.

ఒక కార్ ఆపి ఇద్దరి టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. దీనితో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఆ కార్ ను ధ్వసం చేశారు. దీనితో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. నిజానికి దాడి జరిగింది అమిత్ షా కాన్వాయ్ పై కాదు ఆయన కూడా వెళ్లిన బీజేపీ అభిమానుల కారుపై.

మరోవైపు అరెస్టులకు నిరసనగా తిరుపతి నగర శాసనసభ్యురాలు సుగుణమ్మ నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు అలిపిరి పోలీస్‌స్టేషన్ వరకు ధర్నాకు దిగారు. నగర తెదేపా శ్రేణులు మొత్తం అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించటంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా కార్యకర్తలను విడుదల చేశారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై భాజపా శ్రేణులు ఉద్దేశపూర్వకంగానే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా ఛైర్మన్ నరసింహయాదవ్ మండిపడ్డారు.