Renovation Of Srikalahasti Raja Gopuramశ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో తన విజయానికి చిహ్నంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాజగోపురం నిర్మించారు. ఎలాంటి పునాదులు లేకుండానే 1516లో ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున ఈ గోపురాన్ని నిర్మించారు. దీని పొడవు 96 అడుగులు, వెడల్పు 64 అడుగులు. దేవాలయానికి చుట్టుపక్కల 15 కిలోమీటర్ల వరకు ఈ గోపురం కనిపించేది. అయితే, కాలక్రమేణా ఈ గోపురం శిథిలావస్థకు చేరుకుంది. 2010 మే 26వ తేదీన ఈ గోపురం కూలిపోయింది. గోపురం కూలిపోవడంతో ఆలయం కళ కోల్పోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ గోపురాన్ని నిర్మించేందుకు నవయుగ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. 2010 ఆగస్టు 29న ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోశయ్య గోపురం పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఉండటంతో నిర్మాణం నిదానంగా కొనసాగింది. గోపురం కూలినప్పటి బాధితులకు కూడా పరిహారం చెల్లించి, ఆ తర్వాత పనులను వేగవంతం చేసి పూర్తి చేసింది నవయుగ సంస్థ. దీని నిర్మాణానికి 50 కోట్లు ఖర్చయింది.

దేవరాయల కాలంలో కట్టినట్టే ఇప్పుడు కూడా గోపురాన్ని నిర్మించారు. పాత నిర్మాణం లాగానే పునాదులు లేకుండానే, పూర్తిగా ఇసుక మీదే నిర్మాణం చేశారు. ఏడు అంతస్తులతో 144 అడుగుల ఎత్తున గోపురాన్ని నిర్మించారు. 35 అడుగుల మేర రాతి కట్టడం, మిగిలిన నిర్మాణాన్ని ఇటుకలతో పూర్తి చేశారు. ఎక్కడా సిమెంటును వినియోగించకపోవడం విశేషం. పాత తరహాలోనే కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డు సొనను నిర్మాణానికి వినియోగించారు.