High Court Of Andhra Pradeshవైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమరావతి పై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి దాకా మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి మీద రోజుకో స్టేట్మెంట్ ఇచ్చి గందరగోళానికి గురి చేశారు. తాజాగా హై కోర్టు తరలింపు విషయంపై మరో మంత్రి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తగులుకున్నారు.

హైకోర్టు తరలింపు విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని మొన్న చెప్పి ఆయన, ఇప్పుడు ఏకంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. పరిపాలన పరంగా వికేంద్రీకరణ జరుగుతోందని, హైకోర్టు విషయంలో సీమ వాసులకు మంచే జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు.

హెకోర్టు ఏర్పాటు విషయంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుందన్నారు. దీనిబట్టి తరలింపు ఖాయమని అనిపిస్తుంది.

ఇలా ఒక్కొక్క భవనాన్ని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఒక్కో ప్రాంతానికి తరలించి అమరావతిని నామ్ కే వాస్తే రాజధానిగా ఉంచనున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా రాజధానికి భూములు ఇచ్చిన సుమారు 25000 రైతుల, వారి కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా కనిపిస్తుంది.