religion and caste system in indiaమతం అంటే ఒక సిద్దాంతం, ఒక జ్ఞాన సముపార్చనా అనేది ఒక అభిప్రాయం. హిందువుల పవిత్ర గ్రంథమైన “భగవద్గీత” కాని, ముస్లింలు దైవత్వంగా కొలిచే “ఖురాన్” కాని, క్రిస్టియన్లకు దేవుని వాక్కుగా భావించే “బైబిల్” కాని మనిషికి తెలియని ఎన్నో విషయాల మీద జ్ఞానాన్ని అందించడమే కాకుండా, సమాజంలో తోటి వారితో అనుసరించాల్సిన ప్రవర్తన శైలిని గురించి సవివరంగా… అంటే హేతువాద భాషలో చెప్పాలంటే ప్రాక్టికల్ గా జీవించి చూపిన ఒక గొప్ప చారిత్రాత్మక సిద్దాంతాలే ఈ మతాలూ. మతాలను గౌరవించడం అంటే మన చరిత్రను, మన సంస్కృతిని గౌరవించినట్లే.

మానవ జాతి పుట్టిన తరువాత పుట్టినదే ఈ కులాలు. కులాల మధ్య ఉన్న ఈ అంతరాలను తగ్గించడానికి ఎందరో నాయకులు ఎన్నో పోరాటాలు చేసి కొంత వరకు సమాజంలో కుల వివక్షతను రూపుమాపారు. మన దేశంలో “కులం – మతం” ఈ రెండు రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు నోరు ఇచ్చాడని, రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఇచ్చిందని, మీడియా అవకాశం ఇచ్చిందని కొంతమంది సమాజంలో గుర్తింపు కోసం భావోద్వ్యేగాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరైనది కాదు. మీడియా వారు కుడా ఒక సినిమాని సినిమాలా చూసి వదిలేయలే కాని వాటిమీద అనవసర చర్చలు జరిపి మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు.

మన దేశంలో కులవివక్షను రెచ్చగొట్టేవారు ఎంతమంది ఉన్నారో అలాగే కులాలను గౌరవించే వారు, సంస్కృతి పట్ల సంస్కారం ఉన్న వారు కూడా అంతే మంది ఉన్నారు. మన దేశ పవిత్ర గ్రంధమైన “రాజ్యాంగాన్ని” రచించిన “డా. బి.ఆర్.అంబేద్కర్ గారిది” ఏ కులం? హిందువుల పవిత్ర గ్రంథమైనా రామాయణాన్ని రచించిన “వాల్మీకి” మహర్షిది ఏ కులం? దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన “గాంధీ, భగత్ సింగ్, అల్లూరి”లవి ఏ కులం? వారు వారి కులాల కోసమో లేక వారి కులాల స్వాతంత్ర్యం కోసమో బ్రిటిష్ వారి పై ఉద్యమాలు చేయలేదు. దేశ ప్రజలందిరి కోసం ఉద్యమించి చివరికి మన భవిష్యత్ కోసం వారి ప్రాణాలను సైతం అర్పించారు.

దేశ సరిహద్దులలో రోజుకు ఏంతో మంది “వీర జవాన్లు” వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు ఈ “స్వేఛ్చ – స్వాతంత్రయాలాను” అందిస్తున్నారు. వారందరిది ఏ కులం – ఏ మతం. రాజకీయ నాయకులూ…, సంఘవిద్రోహులు.., సమాజం పట్ల భాద్యత లేని వారు… ఇలా అనేక శక్తులు కలసి సమాజంపై వారి వారి ఉనికి కోసం విద్వేషాలు చిమ్ముతూ ఉంటారు. దానిలో ఏది మంచి, ఏది చెడు అని ఒక అవగాహనకు రావాల్సింది ప్రజలే. దేశ ప్రజలందరూ కలసి కట్టుగా ఇటువంటి వికృత క్రీడలపై నిరసన తెలపాలి. విశ్లేషకుల పేరుతొ మతాలను కించపరిచే ధోరణిలో విమర్శలు చేస్తే అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా మన కులం కాదు, మన మతం కాదు కాదా అన్న చందం గా కాకుండా ఇది మన సంస్కృతీ పై, మన దేశ ఐకమత్యం పై జరిగే దాడిగా గుర్తించి దేశ సమగ్రతను కాపాడుకోవాలి.

సమాజ చైతన్యం దేశ సమగ్రతకే కాదు, దేశ రక్షణకు ఉపయోగపడుతుందనే విషయం గుర్తించి ప్రతిఒక్కరు హక్కులతో పాటుగా భాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ప్రజలలో “కుల – మత” సమానత్వం లేనంత వరకు రాజకీయ నాయకులు దేవుడికి కూడా కులాలను అంటగడతారు. అట్లా అనుకుంటే రాముడు – రెడ్డి అవుతాడా…? లేక కృష్ణుడు – కాపు అవుతాడా…..? కులంతో, మతంతో రాజకీయాలు చేసే ఈ రాజకీయ నాయకులు ఉన్నంత వరకు, అటువంటి వారికి వత్తాసు పలికే ప్రజలు ఉన్నంత వరకు మన దేశంలో మతం ముసుగు మూయదు…, కులం కొట్లాటలు….ఆగవు.

మన భావితరానికి మనం అందించాల్సినది “ఆస్తి – అంతస్తులు” కాదు. దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల భాధ్యత, తోటి వారి పట్ల గౌరవం, స్త్రీ పట్ల సంస్కారం, కలిగి ఉండడంతో పాటు కుల మతాల పట్ల సామాన దృష్టి, సంస్కృతిని గౌరవించే విలువలతో కూడిన జీవన శైలిని అందించాలి. అప్పుడే ఈ మతాల పేరుతొ జరిగే అల్లర్లకు అడ్డుకట్ట పడుతుంది, కులాల కుళ్ళు తో కుచించుకుపోయినా సమాజం నూతన ఉత్సాహంతో ముందుకేల్తుంది. ఇదే మనం మన అమరవీరుల త్యాగాలకు అందించే “గౌరవ వందనం” అవుతుంది.