Reliance Rs 149 unlimited voice calls  300 MB  dataటెలికాం రంగంలో ఒక ప్రభంజనంలా వచ్చి పడింది రిలయన్స్ జియో. మూడు నెలల పాటు కాలింగ్, మెస్సేజ్, ఇంటర్నెట్… ఇలా అన్నీ ఉచితం చెప్పడంతో కస్టమర్లు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. దీంతో ఇతర నెట్ వర్క్ సంస్థలన్నీ ఒక్కసారిగా కుదేలయ్యాయి. తమ వినియోగదారులను కాపాడుకునేందుకు జియోకు పోటీగా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడంలో ‘ఎయిర్ టెల్ అండ్ కో’ నిమగ్నమైన విషయాలు తెలిసినవే. దీంతో అప్పటివరకు వేలకు వేలు చెల్లించిన వినియోగదారులు కాస్త, తమ మొబైల్ బిల్లులను వందలకు పరిమితం చేసారు. ఇదంతా కూడా జియో ఎఫెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇందులో భాగంగానే తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం) ఓ బంపర్ ప్లాన్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. కేవలం 149 రూపాయల రీ చార్జ్ తో అపరిమిత కాలింగ్ సదుపాయాలను కల్పిస్తూ సరికొత్త ప్లాన్ ను విడుదల చేసింది. అంతేకాదు, ఈ రీ చార్జ్ తో 300 ఎంబి డేటాను కూడా అందించనుంది. ఒక విధంగా ‘వెల్కం ఆఫర్’ ముగిసిన తర్వాత జియో కూడా దాదాపు ఇదే రకమైన ప్లాన్ తో ముందుకు రానుందన్న సంకేతాలు వ్యక్తమైన నేపధ్యంలో… జియో ప్రకటనకు ముందే ‘ఆర్ కాం’ అధికారిక ప్రకటన విడుదల చేసేసింది.

అందులోనూ జియోతో పోలిస్తే… ఆర్ కాంకు కలిసి వచ్చే విషయం ఏమిటంటే… ఎలాంటి మొబైల్ లో అయినా ఆర్ కాం సిమ్ పని చేయనుంది. జియో అనేది ‘వోల్ట్’ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మొబైల్ లోనే పనిచేయనుందన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రకంగా మార్కెట్ ను ఆక్రమించుకునేందుకు 2జీ, 3జీ, 4జీ… ఇలా ఏ రకమైన మొబైల్ లో అయినా ఆర్ కాం సిమ్ పనిచేయనుందన్న ప్రమోషన్స్ చేయనుంది. అయితే ఈ సంస్థలన్నీ ఈ సరికొత్త ప్లాన్స్ ను తీసుకురావడానికి గల కారణం మాత్రం ‘జియో’నే అని చెప్పాలి. ఒక విధంగా ‘జియో’ ఎంట్రీతో మొబైల్ వినియోగదారులు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు.