Reliance Jio  to be Valid Until December 2017టెలికాం రంగంలో జియో సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. జియో ఎంట్రీతో మిగతా సంస్థలన్నీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయి, ఒకదాని వెంట మరొకటి ఆఫర్ల వెల్లువను ప్రకటించిన సంగతులు తెలిసినవే. అయితే వీరందరికీ మరో భారీ షాక్ ఇచ్చేందుకు జియో సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఈ సారి కొట్టబోయే దెబ్బకు ప్రత్యర్ధులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అన్న టాక్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ వార్త నిజమైతే మొబైల్ వినియోగదారులకు పండగేనని చెప్పవచ్చు.

జియో ‘వెల్కం ఆఫర్’ పేరిట డిసెంబర్ 2016 వరకు ‘ఆల్ ఫ్రీ’ అని ప్రకటించగా, ఇటీవల హల్చల్ చేసిన సమాచారం ప్రకారం దీనిని మార్చి 2017 వరకు పొడిగించనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ఆఫర్ ను మరో ఏడాది పాటు… అంటే డిసెంబర్ 2017 వరకు కొనసాగించే ప్రకటన వెలువడనుందని, ఈ ఆఫర్ ను ధీరూభాయ్ అంబానీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 28వ తేదీన ప్రకటించబోతున్నారని హల్చల్ చేస్తోన్న సమాచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే, జియో నుండి అధికారిక ప్రకటన వరకు వేచిచూడాల్సిందే.

10 మిలియన్ కస్టమర్లే లక్ష్యంగా రంగంలోకి దిగిన జియో ఊపు మొదటి నెలలో భారీగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత రానూ రానూ పతనమైంది. దీనికి కారణం జియో నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండడం ఒకటైతే, కాల్స్ చేసుకునేందుకు కనెక్ట్ కాకపోవడం, ఇన్ కమింగ్ కాల్స్ రాకపోవడం మరో కారణాలు. దీంతో జియో వలన ఆశించిన ఉపయోగం లేదని భావించిన వినియోగదారుల ఒరవడి తగ్గింది. మరి ఈ సర్వీస్ ల నాణ్యత పెంచితే తప్ప, జియోకు పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.