jio-sim-rulesటెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్ జియో సిమ్ ల వినియోగంపై సదరు సంస్థ మరింత స్పష్టత ఇస్తోంది. ఇప్పటివరకు డిసెంబర్ 31వ తేదీ వరకు అపరిమిత డేటా అంటూ నెట్ ప్రియులను ఊరించిన ‘జియో’ ఫస్ట్ షాక్ కు దిమ్మతిరగడం వినియోగదారుల వంతవుతోంది. అపరిమిత డేటా స్థానంలో 4జీబీ డేటాను మాత్రమే ఉచితంగా వినియోగించుకోవచ్చు అనే నిబంధన ఇచ్చింది.

ఈ 4జీబీ డేటా అయిన పక్షంలో కనీసం బ్రౌజింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అయితే సాధారణ నెట్ వినియోగదారులకు రోజుకు ఈ 4జీబీ ఎక్కువే అయినప్పటికీ, టెక్ ప్రియులకు, హెచ్.డి. వీడియోలను అధికంగా వీక్షించే వారికి ఈ 4జీబీ ఒక్క పూటకు కూడా సరిపోకపోవచ్చు. అలాగే అపరిమితమైన డేటాతో సినిమాలను డౌన్ లోడ్ చేసుకోవాలనువారికి కూడా జియో షాక్ ఇచ్చినట్లయ్యింది.

ఫస్ట్ షాక్ తో మొదలైన ‘జియో’ సవరణలు ఇంకెక్కడికి వెళ్తాయోనని నెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ షాక్ జియో సిమ్ ల కొనుగోలుపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే… ప్రస్తుతం మార్కెట్ లో 4జీబీ డేటాను వినియోగించుకోవాలంటే వందల సంఖ్యలోనే వెచ్చించాల్సి ఉంది. అది కూడా నెలకు! దీంతో ‘జియో’కు మార్కెట్ లో డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.