Reliance Jio Offers to Customersఇప్పటివరకు అంతా ‘ఫ్రీ’ అన్న రిలయన్స్ జియో, ఏప్రిల్ ఒకటో తేదీ నుండి మాత్రం ఏదైనా రీ చార్జ్ చేసుకోవాల్సిందేనని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాము డేటాకు మాత్రమే చార్జ్ చేస్తాము గానీ, వాయిస్ కాల్స్, మెస్సేజ్ ల విషయంలో ‘జియో ప్రైమ్’ మెంబర్లకు మరో ఏడాది పాటు ఉచిత సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి ‘హిడెన్ చార్జెస్’ కూడా ఉండవని నాడు ముఖేష్ అంబానీ స్పష్టంగా చెప్పారు. అయితే ఇవన్నీ కేవలం మాటలకే పరిమితం అవుతోందని, కార్యరూపంలోకి వచ్చేపాటికి వినియోగదారులకు గట్టి షాకే ఇవ్వనుందని లభించిన కీలక సమాచారం.

‘అన్ లిమిటెడ్’ వాయిస్ కాల్స్ కాస్త, ‘లిమిటెడ్’గా మారిపోతున్నాయని, 303 రూపాయలతో రీ చార్జ్ చేసుకున్న వారికి నెలలో కేవలం 1000 నిముషాల కాల్స్ ను మాత్రమే ఇస్తామని, ఇందులో కూడా ఆన్ నెట్ + ఆఫ్ నెట్ కాల్స్ కలిపి ఉంటాయన్న సమాచారం లభిస్తోంది. ఒక్క 303 రూపాయల రీ చార్జ్ విషయంలోనే కాదు, దానికి మించిన రేంజ్ లో రీచార్జ్ చేసుకున్నా, వాయిస్ కాల్స్ పరిస్థితి ఇంతేనని, నెలకు 1000 నిముషాలు మాత్రమేనని, అంటే రోజుకు కేవలం సగటున 33 నిముషాలు మాత్రమేనని తెలుస్తోంది.

అధికారికంగా జియో ప్రకటించనప్పటికీ, ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఇదే వర్తించనుందని, ఇది జియో వినియోగదారులకు ఒక రకంగా షాకింగ్ విషయమేనని, భారీ స్థాయిలో కస్టమర్లను తమ ఖాతాలో వేసుకోవాలనుకున్న జియో ఆశలు నేరేవేర్చే విధంగా ఇవి లేవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 1000 నిముషాల తర్వాత కూడా కాల్స్ చేసుకోవాలంటే, దానికి స్పెషల్ రీచార్జ్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది ‘జియో.’ మరి ఇప్పటివరకు ఫ్రీగా అనుభవించిన జియోను ఎంతమంది కస్టమర్లు పైకం చెల్లించి తీసుకుంటారో అనేది టెలికాం రంగంలో ఆసక్తిగా మారింది.

Reliance Jio Offers to Customers