Reliance Jio Offers - 10 Cr Customersటెలికాం రంగంలో సంచలనంగా ఎంటర్ అయిన రిలయన్స్ జియో, కేవలం 170 రోజుల్లో ప్రతి సెకన్ కు ఏడుగురు కొత్త వినియోగదారులను పెంచుకుంటూ, ఏకంగా 10 కోట్ల మందిని సొంతం చేసుకుని సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ ఘనతను పురస్కరించుకుని జియో అధినేత ముఖేష్ అంబానీ సంతోషంతో తాజాగా సరికొత్త ప్రకటనలు చేసారు. ముఖ్యంగా మార్చి నెలాఖరుతో ముగియనున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్లాన్ తర్వాత, జియో ఎలా ఉండబోతుంది? అన్న దానిని వివరించారు ముఖేష్.

మార్చి 31వ తేదీ లోపున అయిన జియో కస్టమర్లకు కేవలం 99 రూపాయలతో ఏడాది పాటు ‘జియో ప్రైమ్’ కస్టమర్లు అయ్యే అవకాశం లభిస్తుందని, వీరికి ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని చెప్పారు. అలాగే జియో ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే ఏడాదికి 15000 రూపాయల విలువైన జియో యాప్ లకు సంబంధించిన సకల సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయని తెలిపారు. ఇక, వాయిస్ కాల్స్ పై జియో యూజర్లకు మార్చి తర్వాత కూడా ఎలాంటి భారం పడబోదని, రోమింగ్ చార్జెస్ గానీ, ఎలాంటి హిడెన్ చార్జెస్ గానీ ఉండబోవని స్పష్టం చేసారు.

జియో రాక ముందు వరకు ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలో 158వ స్థానంలో ఉన్న ఇండియా, గత నెల వచ్చే సరికి ప్రపంచంలోనే నెంబర్ 1గా మారిందని సగర్వంగా ప్రకటించారు. ఒక్క జనవరి నెలలోనే 100 కోట్ల జీబీ డేటా వినియోగం జరిగిందని, జియో నెట్ వర్క్ లో రోజుకు 5.5 కోట్ల గంటల వీడియోను వీక్షిస్తున్నారని తెలిపారు. ఇక, ప్రస్తుతం అమలవుతున్న ‘అన్ లిమిటెడ్ డేటా’ కావాలంటే మాత్రం నెలకు 303 రూపాయలతో రీ చార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని ‘చావు కబురు చల్లగా’ చెప్పారు. అయితే మార్కెట్ లో ఉన్న పోటీదారులతో పోలిస్తే… జియో టారిఫ్ లు ఇంకా సంచలనంగానే కొనసాగే అవకాశాలు స్పష్టం కనపడుతున్నాయి.