reliance-jioరిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త. డిసెంబర్ 3వ తేదీతో ముగియనున్న ఫ్రీ వాయిస్ కాల్స్, 4జీ డేటా ఆఫర్ ను మరో మూడు నెలల పాటు కొనసాగించే ఆలోచనలో ఆ సంస్థ యాజమాన్యం ఉంది. 2017 మార్చి వరకు ఈ సేవలను పొడిగించడానికి జియో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, ట్రాయ్ నిబంధనల మేరకు వెల్ కమ్ ఆఫర్ కింద ఏ టెలికాం ఆపరేటర్ కూడా 90 రోజులకు మించి ఉచిత సేవలను అందించడానికి వీల్లేదు. ఈ కారణంగానే, ఉచిత సేవలను డిసెంబర్ 3 వరకు ఇస్తున్నట్టు జియో గతంలో ప్రకటించింది.

అయితే, వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు సేవలను అందించలేని పక్షంలో, వారి నుంచి ఛార్జీలను వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమే అనే కోణంలో ఉచిత సేవల కటాఫ్ తేదీని మరో మూడు నెలల పాటు పెంచేందుకు జియో రెడీ అవుతోంది. ఇంటర్ కనెక్షన్ సమస్యలతో తమ కస్టమర్లు నాణ్యమైన సేవలను పొందలేకపోతున్నారని… తాము ఇవ్వాలనుకున్న సేవలను కస్టమర్లు ఇంకా సరిగా పొందలేకపోతున్నారని జియో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

డిసెంబర్ తర్వాత కూడా ఉచిత సేవలను కొనసాగించడానికి తమకు ట్రాయ్ అనుమతి కూడా అవసరం లేదని చెప్పారు. దీంతో, 2017 మార్చి వరకు జియో ఉచిత సేవలు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఇదే కార్యరూపం దాలిస్తే జియో వినియోగదారులకు పండగేనని చెప్పాలి. నిజానికి కాల్స్ కంటే కూడా ఇంటర్నెట్ డేటా కోసమే జియోను వినియోగదారులు వాడుకుంటున్నారు. దీంతో జియో తాజా నిర్ణయంతో వినియోగదారులు మరింత సంతోషదాయకం వ్యక్తం చేయవచ్చు.