Reliance Jio almost free after March 31ఉచిత డేటా ఆఫర్ తో ప్రత్యర్ధి కంపెనీలకు కొరకరాని కొయ్యగా మారిన రిలయన్స్ జియో, తన వినియోగదారులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జియో ఎఫెక్ట్ తో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటి మూడు నెలలు అబ్బూరపరిచే ఆఫర్ తో కస్టమర్లను ఆశ్చర్యపరిచిన జియో, తాజాగా ప్రవేశపెట్టిన న్యూ ఇయర్ ఆఫర్ తో కూడా సంతృప్తి చెందేలా చేసింది.

అయితే మార్చి వరకే ఉన్న ఈ ఆఫర్ తర్వాత జియో పరిస్థితి ఏమిటి అన్నది ఓ ప్రశ్న. ఇంకా రెండు మాసాల సమయం ఉన్నప్పటికీ, జియో ఇస్తున్న ఆఫర్లపై ముందుగానే కన్నేయడం ప్రత్యర్ధి సంస్థలకు పరిపాటిగా మారిపోయింది. జియో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పుతో ఇప్పటికే అన్ని సంస్థలు కూడా తమ తమ టారిఫ్ లను తగ్గించుకున్న వైనం తెలిసిందే. అయితే మార్చితో ముగియబోయే ‘న్యూ ఇయర్ ఆఫర్’ తర్వాత కూడా వినియోగదారులను ఆకర్షించేలా ఓ ప్లాన్ సిద్ధమవుతోందని తాజా సమాచారం.

జియో వినియోగదారుల నుండి కేవలం నామమాత్రపు చార్జీలను వసూలు చేసి, ‘అన్నీ ఉచితంగానే’ అన్నట్లుగా ఇవ్వాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 100 రూపాయలను వినియోగదారుల నుండి వసూలు చేసి, ‘న్యూ ఇయర్ ఆఫర్’ పేరుతో కొనసాగుతున్న ఆఫర్ నే మరో మూడు నెలల పాటు కొనసాగించాలని భావిస్తున్నట్లుగా మార్కెట్ వర్గాల టాక్. జూన్ వరకు అమలులో ఉండేలా సిద్ధం చేస్తోన్న ఈ ప్లాన్ అమలైతే, మరోసారి ‘ఎయిర్ టెల్ అండ్ కో’ మరింత ఒత్తిడికి గురికావడం ఖాయం.