Reliance-Jio-4G-VoLTE-Phone2016లో ‘ఆల్ ఫ్రీ’ అంటూ మూడు నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్, కాల్స్, మెస్సేజ్ తదితర సౌకర్యాలను కల్పించి, టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ ‘జియో’ సంస్థ, 2017లో అతి తక్కువ ధరలో 4జీ సౌకర్యాలు ఉన్న మొబైల్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకు రానుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ బేసిక్ మోడల్ లో ఉంటుందని కొందరు… లేదు స్మార్ట్ ఫోన్ అని మరికొందరు… ఇలా రకరకాలు ప్రచారం జరిగింది.

ఈ ప్రచారానికి శుభంకార్డు వేస్తూ… తాజాగా జియో ప్రవేశపెట్టబోయే ఆ ఫోన్ లుక్ బయటకు వచ్చింది. దాదాపుగా 1500 రూపాయలు విలువ గల ఈ మొబైల్ బేసిక్ మోడల్ లోనే కీ ప్యాడ్ తోనే రానుండగా, ఇందులో 4జీ సౌకర్యాలు కల్పించడం అనేది అదనపు ఆకర్షణ. ఇందు కోసం ‘జియో’ యాప్స్ ను యాక్టివేట్ చేసుకునే విధంగా మరో నాలుగు బటన్స్ ను అదనంగా చేర్చడం ఫోటోలో చూడవచ్చు.

ఈ మార్చి లోపున మార్కెట్ లోకి తీసుకురావాలని, ముఖ్యంగా రూరల్ మార్కెట్ ను ఈ ఫోన్ తో ఏలాలని ‘జియో’ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోంది. ఇప్పటికీ రూరల్ మార్కెట్ లో బేసిక్ మోడల్ కీ ప్యాడ్ ఫోన్లే రాజ్యమేలుతుండడంతో, అదే తరహాలో 4జీతో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మొబైల్ తో పాటు జియో సిమ్ ను కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.