ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో తారా స్థాయికి శరవేగంగా దూసుకెళుతున్న హీరోయిన్ రెజీనా… 103 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని ఎక్కి ఏకంగా పుషప్స్ తీస్తే… ఎలా ఉంటుంది. ఊహించడానికే కాస్త భయానకంగా ఉన్నా, భయానికి భిన్నంగా ఎంజాయ్ చేసి… మీరు కూడా అలా ఆకాశహర్మ్యాలకు వెళితే… ఇలా ఎంజాయ్ చేయడం మరిచిపోకండి అంటూ ఆమె అభిమానులకు చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల అమెరికాకు వెళ్లిన సందర్భంగా రెజీనా ‘స్కైడెక్ షికాగో’ను సందర్శించింది. అందులో చివరి ఫ్లోర్ కు చేరుకుని కింద ఉన్న భవంతులను చూస్తూ ఎంజాయ్ చేసింది.

కాలి కింద ఉన్న అద్దాల్లోంచి కింద కనిపిస్తున్న భవంతులను మరింత దగ్గరగా చూసేందుకంటూ రెజీనా అక్కడే పుషప్స్ మొదలెట్టింది. ఆకాశంలో ఉన్నామన్న ఫీలింగ్, కాళ్ల కింద అద్దాలు, చిన్న గుడిసెల్లా కనిపిస్తున్న భారీ భవంతులను పుషప్స్ చేస్తూనే ఎంజాయ్ చేసిన రెజీనా… అక్కడ ఓ ఫొటో కూడా తీసుకుంది. దానిని తన అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఎప్పుడైనా షికాగో వెళితే స్కైడెక్ షికాగోను సందర్శించడం మరవొద్దని, పుషప్స్ తీయడం అంతకన్నా మరిచిపోవద్దని అభిమానులకు సలహా ఇచ్చింది. ఇక ఫొటో తీసుకోవడం మరీ ముఖ్యమంటూ పేర్కొంది.