Reel-Baahubali-Real-Baahubaliసిల్వర్ స్క్రీన్ పైన అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన చూసి ప్రేక్షకులు ముగ్దులవుతున్నారు. అయితే ఇంతటి ప్రభంజనానికి కారణమైన వ్యక్తి ఎవరూ అన్నది అందరికీ తెలిసిన విషయమే. తెరపై నటీనటులందరూ తమ తమ అభినయాలతో సమ్మోహితులను చేస్తున్నా… చివరికి ‘రాజమౌళి’ పేరే అందరికీ గుర్తుకు వస్తుంది. అలా తన ‘బ్రాండ్’తో ‘బాహుబలి’ని బిల్డ్ చేసాడు జక్కన్న. అందుకే రెండవ వీకెండ్ నాటికే 1000 కోట్లు అందించే దిశగా ప్రేక్షకులు జననీరాజనం పడుతున్నారు.

అయితే ఇంత సాధించిన రాజమౌళిని చూస్తుంటే… కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది? అందరి విషయం ఏమో గానీ, తనయుడు ఎస్.ఎస్.కార్తీకేయ మాత్రం ఓ ఫోటో ద్వారా తన మనోభావాలను ఏమిటో నెటిజన్లకు చాటిచెప్పాడు. ప్రస్తుతం తన తండ్రిపై వస్తున్న ప్రశంసలకు నిదర్శనంగా… ప్రపంచానికి రీల్ బాహుబలి ప్రభాస్ అయితే, రియల్ బాహుబలి రాజమౌళి అని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందంటూ తన భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

అయితే ఈ ఫోటో చూసిన వారు దీనిని ఏకీభవించకుండా ఉండలేరు. ఎందుకంటే… అయిదేళ్ళ పాటు తన శ్వాస, ఆశ అన్నీ ‘బాహుబలి’ అని శ్రమించిన వ్యక్తులలో అగ్ర తాంబూలం రాజమౌళికే దక్కుతుంది మరి. కళ్ళెదురే కనపడుతున్నా, ఆయన ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ‘బాహుబలి’ షాట్స్ చుట్టూ తిరిగేవని రమా రాజమౌళి చెప్తుంటే… అందులో హాస్యం కనపడుతున్నా, సినిమాపై జక్కన్నకున్న పాషన్ ఏ పాటిదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే ఈ ఫోటో ఈ రేంజ్ లో హల్చల్ చేస్తోంది.