Reddy won Again inn Munugode By Electionsకోమటిరెడ్డి సోదరుల అన్నదమ్ముల సవాల్, కల్వకుంట్ల వారి తెలంగాణ దెబ్బ, కాంగ్రెస్ సానుభూతి దీనగాధలు, బిజేపి ఓటుకు కోట్లు … ఇలా ఫామిలీ సెంటిమెంటు, ట్రాజెడీ, సస్పెన్స్, చేజింగ్, థ్రిల్లర్ వంటి నవరసాలు పండిస్తూ ‘కొని’తెచ్చుకున్న మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. రకరకాల సర్వేలు, ఎక్సిట్ పోల్స్ అంచనాలలో కొన్నిటిని నిజం చేస్తూ, ఇంకొన్నిటిని తలకిందులు చేస్తూ టిఆర్యస్ విజయం సాదించింది.

ఈ విజయం మీద కేసిఆర్ చాణక్యం, ధన ప్రభావం, బిజేపి ఆకర్ష మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పతనం… అంటూ రకరకాల విశ్లేషణలు మెుదలయ్యాయి. ఇవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ఇక్కడ మరొక సామాజిక పరమైన అంశం కూడా చూడాలి. ఈ నియెూజకవర్గంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల జాబితా చూస్తే, ఈ ఉపఎన్నికలతో కలిపినా ఇంత వరకు అగ్రవర్ణాల అభ్యర్థులే ఎన్నికౌతున్నారు. అత్యధికంగా రెడ్డి వర్గం నాయకులు 11 సార్లు ఎన్నికయ్యారు. తరువాత వెలమ నాయకులు 5 సార్లు ఎన్నికయ్యారు. ఈ రెండు వర్గాల ఓటర్లు కలిపి సుమారుగా ఒక 10-12% ఉంటారు. కానీ నియెూజకవప్గంలో అత్యధిక సంఖ్యలో ఉండే బిసిలు అందునా 20% పైన ఉన్న గౌడ, 15% వరకు ఉన్న ముదిరాజ్, 10% వరకు ఉండే యాదవులకు గానీ ఇంత వరకు ప్రధానా రాజకీయ పార్టీలు అవకాశం కలిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక బిసిలకు ఎక్కువ ప్రాధాన్యం లభించవచ్చు అని అభిప్రాయాలు ఏర్పడ్డా, 2014 తర్వాత ప్రధాన పార్టీలన్నీ కూడబలుకున్నట్టు రెడ్డి వర్గం నాయకులనే అభ్యర్థులుగా నిలబెట్టాయి. పట్టుబట్టి ఈ ఉపఎన్నికలు రావడానికి కారణం అయిన బిజేపి ధనబలం మెండుగా ఉండి కాంగ్రేసు యంయల్ఏ గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తెచ్చుకుని రాజీనామా చేయించి అభ్యర్థిగా నిలబెడితే, నియెూజకవర్గంలో ప్రదాన సామాజిక వర్గానికి చెందిన డా. బూర నర్సయ్య గౌడ్ వంటి బలమైన బిసి నాయకుడిని దగ్గర ఉంచుకునీ కేసిఆర్ 2018 లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే వరుసగా మూడొవసారీ అవకాశం ఇచ్చారు. ఇక సిట్టింగ్ యంయల్ఏ ఫిరాయించి రాజీనామా చేస్తే వచ్చిన ఉపఎన్నికలో, తెలంగాణ ఇంటి పార్టీ అద్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బిసి వర్గానికి చెందిన డా. చెరుకు సుదాకర్ ను పార్టీలో చేర్చుకున్నా అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి రెడ్డి కి కాంగ్రేసు పార్టీ టికెట్ ఇచ్చింది.

ఇంక కాస్త చెప్పుకోదగ్గ పార్టీలలో బియస్పీ మాత్రం బిసిలకు టికెట్ ఇచ్చినా కనీసం 5 వేల ఓట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. బిసిలు 50% ఉన్న నియెూజకవర్గంలో, పోలైన 93% పై ఓట్లలో దాదాపు 92% ప్రదాన పార్టీలకు చెందిన రెడ్డి అభ్యర్థులకు దక్కికే మిగిలిన వారికి కనీసం 2% కూడా దక్కకపోవడం ఆశ్చర్యకరం. ప్రధాన పార్టీలు ధనబలం చూసి ఇస్తున్నాయెూ లేక జనబలం చూసి ఇస్తున్నాయెూ తెలియదు గానీ, ధనబలం ప్రాతిపదికనైతే ఇక 80% పైన జనరల్ స్థానాల్లో నాన్ రెడ్డి అభ్యర్థులు రాజకీయాలపై ఆశలు వదులుకోవాల్సిందేనేమెూ. మెుత్తానికి మళ్లీ మునుగోడులో రెడ్డే అభ్యర్దే గెలిచారు, మరి బడుగులకు అవకాశమెుప్పుడో!

శ్రీకాంత్.సి