Reasons for Nara Lokesh Pawan Kalyan padayatra delayటిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వేర్వేరుగా అక్టోబర్‌ నుంచి పాదయాత్ర, బస్సు యాత్ర చేపట్టాలనుకొన్నారు. కానీ చివరి నిమిషంలో ఇద్దరూ వాయిదా వేసుకొన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ ఏయే నియోజకవర్గాలలో బలంగా ఉందో అధ్యయనం చేసిన తర్వాత యాత్ర ప్రారంభిస్తానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పగా, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున 2023 జనవరిలో పాదయాత్ర ప్రారంభించాలని నారా లోకేష్‌ నిర్ణయించుకొన్నట్లు టిడిపి వర్గాలు చెపుతున్నాయి. అయితే ఇద్దరూ ఒకేసారి బస్సు, పాదయాత్రలు ప్లాన్ చేసుకొని ఒకేసారి చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడానికి ఇంతకంటే బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది.

సిఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారనే సమాచారం లభించడంతోనే ఇద్దరు ముఖ్య నేతలు ప్రజలలోకి వెళ్ళాలనుకొన్నట్లు తెలుస్తోంది. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల ఆలోచన విరమించుకొన్నట్లు తెలియడంతో వారిరువురూ కూడా తమ యాత్రలను వాయిదా వేసుకొన్నట్లు తెలుస్తోంది.

జగన్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలనుకోవడానికి తర్వాత వద్దనుకోవడానికి కూడా బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. గడప గడపకి కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుందని జగన్ భావించారు. నిధుల కొరత కారణంగా సంక్షేమ పధకాలలో ఆంక్షలు, కోతలు విధిస్తూండటంతో ఓటర్లలో ఆగ్రహం పెరుగుతుందని, మున్ముందు పధకాలు అమలుచేయలేని పరిస్థితి వస్తే మొదటికే మోసం వస్తుందని కనుక పరిస్థితులు కాస్త సానుకూలంగా ఉన్న ఈ సమయంలోనే ముందస్తు ఎన్నికలకి వెళ్ళినట్లయితే గెలిచి మళ్ళీ అధికారంలో కొనసాగవచ్చని సిఎం జగన్మోహన్ రెడ్డి భావించినట్లు సమాచారం.

కానీ ‘గడప గడపకి ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజలు, లబ్దిదారుల నుంచి కూడా వైసీపీ నేతలకు విమర్శలు ఎదుర్కోవలసివచ్చింది. కనుక ఆ కార్యక్రమంపై ప్రభుత్వం చేయించుకొన్న సొంత సర్వేలు, ప్రశాంత్ కిషోర్ బృందం ఇచ్చిన సర్వే నివేదికలలో 50-60 మంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు అసలు బాగోలేదని, వారిని మార్చకతప్పదని తేలడంతో ముందు ఇల్లు చక్కబెట్టుకొన్నాకనే ఎన్నికల గురించి ఆలోచించడం మంచిదని భావించిన సిఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఆలోచనను విరమించుకొన్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలు లేనప్పుడు సుదీర్గ బస్సు, పాదయాత్రలు చేయడం కంటే వచ్చే ఏడాది జనవరి నెలలో మొదలుపెట్టి ఎన్నికల ముందు వరకు బస్సు, పాదయాత్ర చేసినట్లయితే ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అది బాగా గుర్తుంటుంది కనుక ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుందని టిడిపి, జనసేన పార్టీలు భావించినందునే నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ చివరి నిమిషంలో తమ తమ యాత్రలు వాయిదా వేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపుగా నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ వేర్వేరుగా పార్టీ అవసరాలు కార్యక్రమాలను బట్టి జిల్లా పర్యటనలు చేస్తుంటారు. యాత్రలు వాయిదా… అందుకేనా?

Exclusive Video Interviews: Watch & Subscribe