reasons-behind-pawan-kalyan-bvsn-prasad-payment-issue“మంచితనానికి రోజులు కావు” అన్న నీతి సూత్రాన్ని ఇటీవల కాలంలో బహుశా అందరి దగ్గర నుండి వింటూనే ఉన్నాం. అయితే తెర వెనుక ఎలాంటి సంఘటనలు జరిగాయో గానీ, ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ – ప్రసాద్ ల ఉదంతం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2013లో విడుదలైన “అత్తారింటికి దారేది” సినిమా అప్పటివరకు ఉన్న ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. విడుదలకు ముందే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైన ఈ సినిమా పట్ల తెలుగు ప్రేక్షకులు ఎనలేని “సింపతీ”ని ప్రదర్శించి, సినిమా ఎలా ఉన్నా కూడా కలెక్షన్ల వర్షం కురిపించారు. దీంతో 50 రోజుల వేడుకలను కూడా “థాంక్యూ మీట్” పేరుతో ఘనంగా నిర్వహించారు.

ఆ వేడుకలో నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ… పవన్, త్రివిక్రమ్ లేకుంటే ఈ సినిమా విడుదలయ్యేది కాదు అని చెప్పారు. పైరసీ రీత్యా ఏర్పడ్డ పరిస్థితులకు త్రివిక్రమ్, పవన్ లు కూడా అదే రీతిలో సహకారం అందించారు కూడా. మరి అంతటి సహాయ సహకారాలను అందించిన వారికి నిర్మాత ఇప్పటివరకు తను చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకపోవడం కాస్త విస్తుగొలిపే ఘటనే.

విడుదలకు ముందు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, విడుదలైన తర్వాత సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు వచ్చినపుడు సదరు నిర్మాత తిరిగి ఎందుకు చెల్లించలేదు? అన్న ప్రశ్నలు సగటు ప్రేక్షకుడి మదిలో మెదులుతున్నాయి. అంటే “అత్తారింటికి దారేది” సినిమా కలెక్షన్స్ భోగస్సా? లేక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో ఒక మంచి నిర్మాతగా పేరు తెచ్చుకున్న ప్రసాద్ గురించి వినపడేదంతా పై పై మాటలేనా? ఇలా రకరకాల ప్రశ్నలు ఒక్క పవన్ ఫిర్యాదుతో మొదలయ్యాయి.

నిజానికి 2013లో ఇవ్వాల్సిన మొత్తం గురించి 2016 వరకు వేచి చూసారంటే అది పవన్ కళ్యాణ్ మంచితనంగానే పరిగణించాలి. “పైసా”కు తప్ప మనుషులకు విలువ లేదనే విధంగా మారిన నేటి రోజుల్లో ఒక నిర్మాత శ్రేయస్సు కోసం దాదాపు మూడు సంవత్సరాలు వేచిచూడడం సాధారణ విషయం కాదు. ఒక్క పవన్ కే కాదు, త్రివిక్రమ్ కు కూడా కొంత మొత్తాన్ని సదరు నిర్మాత చెల్లించాల్సి ఉందని తాజాగా అందుతున్న సమాచారం.

ఇలా చేసుకుంటూ పోతే “విలువలకు” కట్టుబడి ఉన్న మనుషులు కూడా భవిష్యత్తులో వాటికి తిలోదకాలిచ్చేసే పరిస్థితి నెలకుంటుంది. మున్ముందు ఎంత మంచి నిర్మాతకు ఆపద వచ్చినా సహాయం చేయడానికి ఒకటికి రెండు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజా పరిణామాలతో నిర్మాత ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పినట్లుగా సమాచారం. అయితే అంతటి సహాయ సహకారాలు అందించిన వారికి సరైన సమయానికి నిర్మాత ప్రసాద్ తిరిగి చెల్లించకపోవడం వెనుక “అసలు” కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న రీతిలో ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.