అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం వేసిన అంచనా లక్ష కోట్లు…
మరో పదేళ్లు గడిస్తే ఈ లక్ష కోట్లు ఆరేడు లక్షల కోట్లు…
ఇవన్నీ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కోసమే…
అలాంటిది ఒక మహా నగరాన్ని నిర్మించాలంటే కష్టం..!
ఇది క్లుప్తంగా అమరావతి నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన సంగతులు. నిజంగా ఆరేడు లక్షల కోట్ల రూపాయలు అమరావతికి వెచ్చించాలా? అన్న ఆలోచనను కలిగించిన సీఎం జగన్ మాటల్లో ఉన్న వాస్తవమెంత? అన్న చర్చ జరగడం సహజం.
దీనికి సమాధానంగా “చంద్రబాబు విజన్” అన్న అంశం తెరమీదకు వచ్చింది. రాజధాని నిర్మాణం ఒక బృహత్తర కార్యమని అందరికీ తెలిసిందే. ‘నా వల్ల కాదు’ అంటూ చంద్రబాబు చేతులెత్తేయకుండా, అమరావతి నిర్మాణానికి అమరావతే పెట్టుబడులు తెచ్చుకునే విధంగా ప్రణాళికలు రచించారు.
అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన కామెంట్స్ తో నాడు చంద్రబాబు సంకల్పించిన ఆలోచనలు ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాయి. ‘ప్రజా రాజధాని’గా నామకరణం చేసిన అమరావతి నిర్మాణాన్ని ఒక ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్’ క్రింద చంద్రబాబు రూపకల్పన చేసారు.
అంటే అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చును అమరావతి నగరమే సమకూర్చుకుంటుంది. దీనికి ప్రభుత్వ పరంగా పెట్టాల్సిన ఖర్చు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా లక్షల కోట్లు కాదు. నికరంగా ప్రభుత్వం ప్రతి ఏటా పెట్టాల్సిన ఖర్చు దాదాపుగా 7 వేల కోట్లు మాత్రమే!
అమరావతి నిర్మాణాన్ని రెండు దశల్లో చంద్రబాబు ప్లాన్ చేసారు. మొదటి దశలో కోర్ కాపిటల్ గా పిలవబడుతున్న 17 చదరపు కిలోమీటర్ల పరిధిని అభివృద్ధి చేసే విధంగా, దీనికి 55 వేల కోట్లు అవసరమవుతుందని 2019లో ఏపీసీఆర్డీఏ అంచనా వేసింది.
ఇక రెండో దశ నిర్మాణానికి 54 వేల కోట్లు కావాలని అంచనా వేశారు. ఈ రెండు దశల్లో అయ్యే మొత్తం దాదాపుగా ఒక లక్షా పది వేల కోట్లు. అయితే ఈ మొత్తంలో మొదటి దశలో అయ్యే ఖర్చు 55 వేల కోట్లను భరించగలిగితే, రెండో దశ ఖర్చు మొదటి దశలో జరిపిన అభివృద్ధిపై వచ్చే విధంగా ప్రణాళికలను రచించారు.
అలాగే మొదటి దశలో అవసరమయ్యే 55 వేల కోట్లు కూడా ఎలా సమకూర్చుకోవాలో కూడా చంద్రబాబు సిద్ధం చేసారు. 37 వేల కోట్ల రూపాయలను బ్యాంకులు, బాండ్లు రూపంలో సమకూర్చుకునే విధంగా, మిగిలిన మొత్తంలో ఆరేళ్ళ పాటు ప్రతి ఏడాది దాదాపుగా 12 వేల కోట్లు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందని వ్యూహాలు రచించారు.
ప్రభుత్వం కేటాయించే 12 వేల కోట్లల్లో జీఎస్టీ రూపంలో 6 వేల కోట్లు తిరిగి వస్తాయని, నికరంగా చెప్పాలంటే 6600 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుందనేది చంద్రబాబు అంచనా. ఈ మొత్తం భరించలేక నేడు చేతులెత్తేసింది జగన్ సర్కార్.
ఇక రెండో దశలో అయ్యే ఖర్చును నాటి చంద్రబాబు సర్కార్ అంచనా వేసింది. రైతులకు ఇవ్వగా, ప్రభుత్వం దగ్గర ఇంకా 8274 ఎకరాల భూమి ఉంటుంది. ఆర్ధిక అవసరాల అభివృద్ధి కోసం 3254 ఎకరాలను ప్రభుత్వం పక్కన పెట్టగా, మిగిలిన 5020 ఎకరాలను రెండు భాగాలను చేసారు. ఇందులో ఒక భాగం 3709 ఎకరాలను ల్యాండ్ మోనిటైజేషన్ ద్వారా 78 వేల కోట్ల రూపాయల రానున్నాయి.
అలాగే మొదటి దశలో ఖర్చు పెట్టే మొత్తంలో జీఎస్టీ ద్వారా దాదాపుగా 6 వేల కోట్లు ప్రభుత్వానికి రానున్నాయి. అంటే మొదటి దశలో అయ్యే ఖర్చు 55 వేల కోట్లుగా, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 85 వేల కోట్లు. రెండో దశలో ప్రభుత్వం దగ్గర మిగిలి ఉన్న 1311 ఎకరాలను ల్యాండ్ మోనిటైజేషన్ ద్వారా మరో 92 వేల కోట్లు సమకూర్చుకోవచ్చని అంచనా వేసింది. దీనికి జీఎస్టీ ఆదాయం మరో 6 వేల కోట్లు అదనం.
రెండో దశలో 54 వేల కోట్లు ఖర్చు పెడితే, 99 వేల కోట్లు తిరిగి వస్తాయనేది అంచనా. ఇలా రెండు దశల్లో రాజధాని కోసం అయ్యే ఖర్చు 1.10 లక్ష కోట్లు కాగా, ఆదాయం 1.80 పైనే వస్తుందని… అలాగే 2.50 లక్షల కోట్లు పొటెన్షియల్ జీడీపీ ఉన్న అమరావతికి పన్నుల రూపంలో ప్రతి ఏడాది 17500 కోట్లు వస్తాయని నాడు లెక్కలు కట్టారు.
అలా అమరావతికి ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్’గా రూపుదిద్దారు చంద్రబాబు. ఇవన్నీ అర్ధం కావాలన్నా, వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలన్నా… రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉండాలి, అంతకుమించిన సంకల్ప బలం ఉండాలి. అవి ఉంటేనే రాజధాని నిర్మాణం సాధ్యం, లేదంటే ‘హ్యాండ్సప్’ అంటూ ‘కాకి లెక్కలు’ చెప్పేయడమే… అంటూ విశ్లేషణలు చేయడం పొలిటికల్ పండితుల వంతు!