printing-defect-in-new-500-notesకొత్త 500 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చి కేవలం రెండు వారాలైనా కాలేదు, రెండు రకాల నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. ఈ రెండు నోట్లలో ఎన్నో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో అయోమయం నెలకొంటోందని, ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలియని పరిస్థితి నెలకొందని నిపుణులు అంటున్నారు. గాంధీ ముఖం నుంచి సిల్వర్ థ్రెడ్ వరకూ పలు తేడాలు ఈ నోట్ల మధ్య కనిపిస్తున్నాయి.

కొన్ని నోట్లలో గాంధీ బొమ్మ పక్కనే ఉన్న సిల్వర్ థ్రెడ్, మరికొన్ని నోట్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న అక్షరాలపైకి ఎక్కింది. ఎడమవైపు మధ్యలో కనిపించే గ్రే కలర్ షడ్ కొన్ని నోట్లలో నోటు బయటకు వెళ్లిపోయింది. బ్రెయిలీ లిపిలో ఉండాల్సిన గుర్తు సైతం పక్కకు జరిగింది. గాంధీ బొమ్మ రెండు షేడ్స్ లో ముద్రితమైంది. ఆయన చెవి కింద ఉండాల్సిన 500 సంఖ్య చెవి పైకి ఎక్కింది. ఇలా ఎన్నో తేడాలు ఈ నోట్ల మధ్య కనిపిస్తున్నాయి.

ఇక ఈ వైవిధ్యమైన నోట్లపై ఆర్బీఐ ప్రతినిధి అల్పనా కిల్లావాలా స్పందిస్తూ, త్వరగా మార్కెట్లోకి పంపాలన్న తొందరలో కొంత ప్రింటింగ్ మిస్టేక్ జరిగి ఉండవచ్చని అన్నారు. వీటిని ఏ మాత్రం అభ్యంతరం లేకుండా వ్యాపారులు, ప్రజలు స్వీకరించవచ్చని, అనుమానాలుంటే, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వాటిని ఆర్బీఐకి పంపించవచ్చని వివరించారు.