rbi-new-rules-for-gold-withdrawlsరిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అది ఎంత తెలివైన నిర్ణయం అంటే… అది విన్నాక అందరూ జోహార్లు కొట్టాల్సిందే! ఆర్బీఐ తాజాగా ప్రకటించిన నిబంధనల ప్రకారం… నగదు విత్ డ్రాలపై పూర్తిగా నియంత్రణ ఎత్తివేసింది. అయితే ఒక కండిషన్… కొత్తగా చలామణిలో ఉన్న నోట్లు ఎంతయితే మీరు డిపాజిట్ చేస్తారో… అంత మొత్తాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా విత్ డ్రా చేసుకోవచ్చు.

ఏంటి అర్ధం కాలేదా… కాకపోవడానికి ఏమీ లేదు. అసలు వినియోగించుకోవడానికి కొత్త నోట్లు అందుబాటులో లేవు బాబోయ్ అంటూ జనాలు గగ్గోలు పెడుతుంటే… కొత్త నోట్లను మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేయడం, దానినే మరలా విత్ డ్రాలు చేసుకోవచ్చనే అద్భుతమైన ఆలోచన ఎవరికీ తట్టిందో గానీ… వారికి సలాం చేయాల్సిందే. ఓ పక్కన కడుపు మంటతో ప్రజలు క్యూలో నిల్చుంటే… ఇలాంటి అతితెలివి ఆలోచనలు చేస్తూ ప్రజలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు.

నిజంగా కొత్త నోట్లు ఉంటే… అవి ప్రజలు వినియోగించుకుంటారు గానీ, ఎందుకు బ్యాంకులలో వేసుకుంటారు. కొత్త నోట్ల కోసమే కదా జనాలు ఉదయం నుండి బారులు తీరుతూ నిల్చునేది..! కనీసం ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోగా, జనాలు మరింత ఆగ్రహానికి గురయ్యేలా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.