rbi-new-500-notes-half-printedరిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త అయిదు వందల రూపాయలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, అవి మార్కెట్ లో పెద్దగా లభించడం లేదన్న విషయం తెలిసిందే. ఎక్కువగా 2000 రూపాయల నోట్లే చలామణిలో ఉండడంతో, ప్రజలకు పెద్ద ఎత్తున చిల్లర ఇబ్బంది తలెత్తింది. అయితే ఇబ్బందులను గమనించామని, 500 రూపాయల నోట్లను ఏటీఎంలో పెడుతున్నామని ఎప్పటికప్పుడు ఆర్బీఐ అధికారులు చెప్తున్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు.

అయితే ఎట్టకేలకు కొన్ని బ్యాంకుల ఏటీఎంలోకి అందుబాటులోకి వచ్చిన ఈ 500 రూపాయల నోట్లను చూసి అవాక్కవ్వడం ప్రజల వంతవుతోంది. ముంబాయిలోని ఓ హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు ఏటీఎం నుండి విత్ డ్రా చేసిన 500 రూపాయల నోట్ల ముద్రణ ఆశ్చర్యపరుస్తోంది. సదరు 500 రూపాయల నోట్ల ప్రింటింగ్ లో ఒక వైపు మొత్తం చెరిగిపోయినట్లుగా ఉండడంతో… వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి హల్చల్ చేస్తున్నాయి.

ఇప్పటికే 2000 రూపాయల నోటు ముద్రణ నాణ్యతపై అనేక విమర్శలు తలెత్తగా, తాజాగా 500 రూపాయల నోటు ప్రింటింగ్ కు సంబంధించి సందడి చేస్తున్న ఫోటోలు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పనితీరును ప్రశ్నార్ధకం చేస్తోంది. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఏటీఎంలకు కరెన్సీని పంపిస్తున్నారన్న ఆరోపణలు ఎదురవుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఏకరువు పెట్టడానికి ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లభించినట్లవుతోంది.