గతేడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు అంశం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ‘బ్లాక్ మనీ’ నియంత్రణ కోసమే అంటూ నాడు ప్రధాని ప్రసంగం చేయగా, కాదు కాదు ‘ఫేక్ కరెన్సీ’ నియంత్రణ కోసం అంటూ తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే ప్రధాని ప్రకటించిన బ్లాక్ మనీ సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఆర్బీఐ తాజాగా ఫేక్ కరెన్సీ కోసమంటూ సరికొత్త పల్లవి అందుకుంది.
నోట్ల రద్దు వెనక అసలు కారణాలేంటన్న విషయాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి లిఖిత పూర్వకంగా వెల్లడిస్తూ… నల్లధనం కోసం నోట్ల రద్దును తెర పైకి తీసుకు రాలేదని, దేశంలో చలామణి అవుతున్న నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం తమకు తెలిపిందని ఆర్బీఐ వెల్లడించింది. ఇండియాలో నకిలీ నోట్లు దాదాపుగా 400 కోట్ల వరకూ ఉంటాయని అంచనా వేసిన కేంద్రం, వీటి కోసమే పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగా పేర్కొంది.
రోజురోజుకూ నకిలీ నోట్ల సమస్య పెరుగుతూ ఉండటం, పొరుగు దేశాల్లోని ప్రభుత్వ ముద్రణాలయాల్లోనే వీటిని ముద్రిస్తుండటం సమస్య కావడంతో, దీని నుండి బయట పడేందుకు పెద్ద నోట్లను రద్దు చేసినట్టు తెలిపింది. అయితే దేశంలో ఉన్న 400 కోట్లను ఏరడానికి దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేయడం… ఎలాంటి విజ్ఞతతో కూడిన చర్యో అంటూ నోరెళ్ళబెడుతున్నారు. నోట్ల రద్దు అంశం అట్టర్ ఫ్లాప్ కావడంతో, ఈ నిందను మోసేందుకు అటు కేంద్రం గానీ, ఇటు ఆర్బీఐ గానీ సిద్ధంగా లేదన్న విషయం ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.