Rayapati-Sambasiva-Rao_Narasaraopetaఏపీలో ఎన్నికలకి ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ నేడో రేపో ముందస్తు ఎన్నికలు జరుగబోతున్నట్లు అధికార, ప్రతిపక్షాల నేతల హడావుడి చేస్తున్నారు. గుంటూరులో నిన్న నారా లోకేష్‌ జన్మదినవేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టిడిపిని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని బెదిరిస్తున్నట్లు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా కాళ్ళకి ఇబ్బంది ఉంది కనుక నేను వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని అనుకొంటున్నాను. కనుక మా అబ్బాయి పోటీ చేస్తాడు. అతనికి సీటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడుకి ఇదివరకే అడిగాను. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్దమే. కానీ తాడికొండ సీటుని తోకల జనార్ధన్ రావుకే ఇవ్వాలి. ఆయనకిస్తే తప్పకుండా గెలుస్తారు.

నరసరావుపేట ఎంపీ సీటుని కడప వాళ్ళకిస్తే మేమే ఓడిస్తాం. చూస్తూ చూస్తూ నా సీటుని వేరెవరికో కట్టబెడతానంటే ఎలా ఊరుకొంటాను?కడప నుంచి వస్తున్న ఆయన దగ్గర పోటీ చేయడానికి తగినంత డబ్బు ఉందా? అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తాను. నేను బరిలో దిగితే నన్ను ఎదుర్కోగలాడా? నేను బరిలో దిగితే మరెవరూ పనికిరారు,” అని అన్నారు.

జనసేన గురించి మాట్లాడుతూ, “పవన్‌ కళ్యాణ్‌ టిడిపితో పొత్తులు పెట్టుకొంటామని చెపుతున్నారు. పెట్టుకొంటే మంచిదే. పెట్టుకోకపోయినా మంచిదే. రెండు పార్టీల పొత్తులు ఖరారైతేగానీ ఇప్పుడే సీట్ల గురించి మాట్లాడలేము. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలవడం ఖాయం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో మళ్ళీ టిడిపి ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. దీనిలో ఎవరూ ఎటువంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదు,” అని రాయపాటి అన్నారు.

గత ఎన్నికలలో నరసారావుపేట నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన శ్రీకృష్ణదేవరాయలు గెలవగా, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ (టిడిపి) గెలిచారు. ఈసారి నరసారావుపేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు నుంచి పోటీ చేయాలని, నరసరావుపేటలో ఇంకా బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని వైసీపీ భావిస్తోంది. కానీ ఈసారి నరసారావుపేటలో వైసీపీ ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టిన్నా ఖచ్చితంగా ఒడిస్తామని రాయపాటి హామీ ఇస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు ఏం నిర్ణయం తీసుకొంటారో చూడాలి.