Raviteja Ravanasuraరవితేజ లాంటి మాస్ హీరోతో క్రైమ్ థ్రిల్లర్ తీయాలనుకోవడం మంచి ఆలోచనే. దర్శకుడు సుధీర్ వర్మ రావణాసుర కథ చెప్పినప్పుడు హీరో నిర్మాత బహుశా కొత్తగా ఫీలవ్వడం వల్లే ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో ఇద్దరి డబ్బులూ ఉన్నాయి కాబట్టి బాగా ఎగ్జైట్ అయిన వైనం కనిపిస్తుంది. అయితే పాయింట్ డిఫరెంట్ గా ఉన్నంత మాత్రాన సరిపోదుగా. పేపర్ మీద థ్రిల్లింగ్ గా అనిపించిన సబ్జెక్టు తెరమీదకొచ్చేప్పటికీ అంతే ప్రభావం చూపిస్తుందని గ్యారెంటీ ఎక్కడిది. ప్రతిదీ జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఏ అంశం బ్యాలన్స్ తప్పినా అసలుకే మోసం వస్తుంది. ఇటు అభిమానులను అటు ప్రేక్షకులను ఇద్దరినీ మెప్పించలేక ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

రావణాసురకు స్ఫూర్తి బెంగాలీనో ఫారినో అనవసరం. ఎక్కడి నుంచి తీసుకున్నా మన ప్రేక్షకులను ఒప్పించడం ముఖ్యం. రవీంద్ర(రవితేజ) ఓ లాయర్. కనకం(ఫరియా అబ్దుల్లా)దగ్గర అప్రెంటీస్ చేస్తుంటాడు. చేయని హత్యలో ఇరుక్కుపోయిన తండ్రి(సంపత్) ని రక్షించుకోవడం కోసం ఓ అందమైన అమ్మాయి(మేఘ ఆకాష్) వీళ్ళ ఆఫీస్ కొస్తుంది. కేసైతే ఒప్పుకుంటారు దాంట్లో బోలెడు చిక్కులు. ఈలోగా వరసగా ఏవేవో మర్దర్లు జరుగుతాయి. వాటిలో రవీంద్రతో పాటు మేకప్ ఆర్టిస్ట్ సాకేత్(సుశాంత్) ప్రమేయం ఉంటుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్(జయరాం) ముందు ఎన్నో సవాళ్లు. చివరికి ఎలా ఛేదించాడన్నదే స్టోరీ.

మాస్ హీరోలని నెగటివ్ షేడ్స్ లో చూపించడం అంత సులభం కాదు. తన పేరు మీద చిరంజీవి అలాంటి ప్రయోగం చేస్తే దెబ్బ కొట్టింది. రామ్ గోపాల్ వర్మ అంతంలో నాగార్జునని విలన్ టచ్ తో చూపించడం జీర్ణం కాలేదు. సుల్తాన్ లో బాలకృష్ణకూ ఈ ఇబ్బంది వచ్చింది. జై లవకుశలోనూ ఈ సమస్య వచ్చినా మరో ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ లు ఉండటంతో బాబీ మానేజ్ చేశాడు. కానీ రావణాసురలో రిస్క్ మొత్తం రవితేజ భుజాల మీదకు తోశాడు సుధీర్ వర్మ. పైగా ఇంత సీరియస్ డ్రామాలో నవ్వు రాని జోకులు, ఫార్వార్డ్ చేస్తే బాగుందనిపించే పాటలు, ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగే మలుపులు ఇలా అంతా ఫార్ములాగా సాగుతుంది.

వీటి సంగతి ఎలా ఉన్నా ప్రోస్తటిక్స్ అనే మేకప్ టెక్నిక్ ని ఉపయోగించి అచ్చం మనిషిని పోలిన మనిషి మాస్కుని చేయడం దాదాపు అసాధ్యం. అదేదో బిస్లరీ వాటర్ కొన్నంత సులభంగా జరుగుతుందనేలా రచయిత శ్రీకాంత్ విస్సా రాసుకోవడం చూస్తే సరైన రీసర్చ్ చేయలేదనిపిస్తుంది. ఏదీ లాజిక్స్ ప్రకారం ఉండదు. రవితేజ చేసే క్రైమ్ తో మొదలుపెట్టి పోలీసులు ప్రవర్తించే తీరు దాకా అన్నీ తేలికగా జరిగిపోతాయి. స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో సుధీర్ వర్మ మరోసారి తడబడ్డాడు. రవితేజని సీరియస్ గా చూపించనంత మాత్రాన జనాలు థ్రిల్ అయిపోరు. దానికి సరిపడా కంటెంట్ కోటింగ్ పడాలిగా. రావణాసురలో అదే మిస్సయ్యింది.