raviteja character in bengal tiger movieఒకే తరహా నటనను చూసి చూసి ప్రేక్షకులు విసిగెత్తిపోయినా… విమర్శకులు తమ పదాలతో విరుచుకుపడినా… తన స్టైల్ మాత్రం మార్చేది లేదు అంటున్నాడు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం ‘బెంగాల్ టైగర్’తో ధియేటర్లలో సందడి చేస్తున్న రవితేజ నటన గురించి చెప్పేదేముంది. తన ఫస్ట్ సూపర్ హిట్ చిత్రం ‘ఇడియట్’లో ఎలాంటి అభినయాన్ని ప్రదర్శించారో తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’లోనూ అదే రకమైన నటనను కనబరిచారు. ఈ సినిమా హిట్టో, ఫట్టో అన్న విషయం పక్కన పెడితే రవితేజ నటన మరోసారి విమర్శకులకు పని చెప్పినట్లయ్యింది.

“ఇడియట్, ఈ అబ్బాయి చాలా మంచోడు, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఒక రాజు ఒక రాణి, దొంగోడు, వీడే, వెంకీ, చంటి, భద్ర, భగీరధ, షాక్, ఖతర్నాక్, దుబాయ్ శీను, కృష్ణ, బలాదూర్, కిక్, ఆంజనేయులు, డాన్ శీను, మిరపకాయ్, దొంగల ముఠా, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు, బలుపు, పవర్, కిక్ 2, బెంగాల్ టైగర్…” ఈ సినిమా పేర్లు, హీరోయిన్లను, హీరో గారి కాస్ట్యూమ్స్ లను పక్కనపెడితే రవితేజ హావభావాలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఇక, రవితేజ తొలినాళ్ళల్లో చేసిన “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఖడ్గం, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, శంభో శివ శివ శంభో, నేనింతే” వంటి అతి కొద్ది చిత్రాలలో మాత్రమే కాస్త వినూత్నమైన అభినయాన్ని ప్రదర్శించారు.

సాధారణంగా కెరీర్ తొలినాళ్ళల్లో ‘సేఫ్ జోన్’లో నిలవడం కోసం కమర్షియల్ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ రవితేజ నిలదొక్కుకున్నాక కూడా అదే రకమైన నటనతో ప్రేక్షకులకు ‘బోర్’ కొట్టిస్తున్నారన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. నిజానికి రవితేజపై ఈ రకమైన విమర్శలు రావడం ఇదే ప్రధమం కాదు. గతంలోనూ సినీ విమర్శకుల నుండి ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడయ్యాయి. అయితే వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, తనదైన శైలిలో తనకు వచ్చిన, నచ్చిన విధంగానే దూసుకుపోయారు, పోతున్నారు కూడా..! రవితేజ నటన గురించి విమర్శలే కాదు, ప్రశంసలు కూడా వస్తున్నాయి. 2002లో ‘ఇడియట్’ ద్వారా ప్రారంభమైన ఎనర్జిటిక్ యాక్షన్ ను 14 సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగించడం సాధారణ విషయం కాదన్న ప్రశంసలు కూడా వినపడుతున్నాయి.

అయితే ప్రస్తుత యువతరం కొత్తదనాన్ని కోరుకుంటోంది. అభిమాన హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ఫ్యాన్స్ కు నచ్చుతుంది. కానీ, రవితేజ విషయంలో రానూ రానూ కొందరు అభిమానులే ఆయన ఎంచుకుంటున్న సినిమాల పట్ల, కనబరుస్తున్న అభినయం పట్ల పెదవి విరుస్తున్నారు. పది, పదిహేనేళ్ళుగా ఒకే తరహా ఎక్స్ ప్రెషన్స్ చూసి చూసి అలసిపోయామని, ఇక భరించడం తమ వల్ల కాదంటూ సోషల్ మీడియాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. రవితేజ నటించిన సినిమాలలో ఒకటైన “నేనింతే” టైటిల్ కు ఆయన ‘బ్రాండ్ అంబాసిడర్’ లాంటి వారన్నది విమర్శకుల మాట.