Ravichandran Ashwin World Recordటీమిండియాలో ఆల్ రౌండర్ గా రాణిస్తున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో చివరి రెండు వికెట్లను పడగొట్టడం ద్వారా, తన వికెట్ల సంఖ్యను 250కి చేర్చుకుని, అతి తక్కువ మ్యాచ్ లలో ఈ ఘనతను అందుకున్న బౌలర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఆస్ట్రేలియన్ బౌలర్ డెన్నిస్ లిల్లీ 48 టెస్ట్ మ్యాచ్ లలో 250 వికెట్లను అందుకోగా, అశ్విన్ 45 మ్యాచ్ లలోనే అందుకుని, లిల్లీ రికార్డును తిరగరాశాడు.

లిల్లీ తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ 49 మ్యాచ్ లలో, అలెన్ డోనాల్డ్ 50 మ్యాచ్ లలో, పాకిస్తాన్ స్పీడ్ అండ్ స్వింగ్ దిగ్గజం వకార్ యునిస్ 51 మ్యాచ్ లలో, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 51 మ్యాచ్ లలో ఈ ఘనతను అందుకున్నారు. గత ఏడాది కాలంగా తన కట్టుదిట్టమైన బౌలింగ్ తో వికెట్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకోవడంలో అశ్విన్ సక్సెస్ కావడంతో, ఈ అరుదైన రికార్డు మనోడి సొంతమైంది. భవిష్యత్తులో కూడా మరిన్ని వికెట్లు నేలకూల్చి, తద్వారా టీమిండియా విజయాలలో అశ్విన్ కీలకపాత్ర పోషించాలని ఆశిద్దాం.