Ravanasura Trailer ఎంతసేపూ పక్క బాషల సినిమాలని అందులోనూ మరీ ముఖ్యంగా మలయాళంవి పొగడకుండా ఉండలేని బ్యాచ్ సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. నిజానికి అవేమంత గొప్పగా ఉన్నా లేకపోయినా మన టేస్ట్ ఉన్నతంగా ఉందని నిరూపించుకోవాలంటే ట్వీట్లు పోస్టులు పెట్టాలని రూల్ పాటించే వాళ్ళు ఎందరో. మరాఠి నటసామ్రాట్ ని ఆహా ఓహో అని కొన్నేళ్ల క్రితం తెగమోసిన మన జనాలే ఇవాళ రంగమార్తాండ అంతే గొప్పగా తెలుగులో వస్తే కుటుంబాలను థియేటర్లకు తీసుకెళ్లలేదు. గొప్ప క్యాస్టింగ్ ఉన్నా సరే బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.

మన సమస్య ఒకటే. కమర్షియల్ జానర్ కి బాగా అలవాటు పడిపోవడం. ఈ మధ్యే టాలీవుడ్ అందులో నుంచి కాస్తయినా పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. బలగం చూశాం కదా. కేవలం రెండు కోట్లలోపే అమ్మితే ఏకంగా ఇరవై కోట్ల గ్రాస్ ని దాటించింది. అది కూడా అత్యధిక శాతం తెలంగాణ నుంచి వచ్చిన వసూళ్లతో. నేటివిటీ సమస్య వల్ల ఏపీలో ఆ స్థాయిలో ఆడలేదు కానీ లేకపోతే వసూళ్ల దెబ్బకు మతులు పోయేవి. క్రమంగా మాస్ స్టార్లు ఏదో వైవిధ్యంగా చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రవితేజ రావణాసుర అలాంటి వైబ్స్ ని కొంతైనా ఇస్తోంది.

కామెడీ, పాటలు, ఫైట్లు ఇలా రెగ్యులర్ మసాలా ఎంత ఉన్నా పడికట్టు మాస్ సూత్రాలకు భిన్నంగా క్రైం ఎలిమెంట్ ని జోడించడం ఆసక్తి రేపెలా ఉంది. ఫలితం ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది కానీ క్రియేటివిటీ కోణంలో చూస్తే మార్కెట్ ఉన్న హీరోలు ఇలాంటివి చేయడం వల్ల ఆడియన్స్ అంచనాల్లో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదు. కేరళలో మెచ్యూర్డ్ కంటెంట్ రావడానికి కారణం అదే. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా అక్కడి మేకర్స్ కథలను రాసుకుంటున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ లు సైతం ఎక్స్ పరిమెంట్ జోన్ లోకి వచ్చారు. దృశ్యం సక్సెస్ అయ్యింది ఈ మేకోవర్ వల్లే.

రాబోయే జనరేషన్ ని ఇప్పుడే అంచనా వేయలేం కానీ వాళ్లలో వస్తున్న చేంజ్ ని వీలైనంత త్వరగా గుర్తించాలి. ఒకప్పుడు డిజాస్టర్లని తిరస్కరించిన వాటిని ఇప్పుడు రీ రిలీజ్ పేరుతో తీసుకొస్తే హౌస్ ఫుల్స్ చేస్తున్నారు. అంటే నిన్నటి తరానికి నచ్చనిది ఇప్పుడు కనెక్ట్ అవుతోంది. ఈ గ్యాప్ ని పసిగట్టిన వాళ్లే సక్సెస్ అవుతారు. తమిళంలో వెట్రిమారన్, ధనుష్ లాంటి వాళ్ళు ఇది అనుసరించడం వల్లే సీరియస్ సబ్జెక్టులతోనూ హిట్లు కొడుతున్నారు. అందరూ మారాల్సిన అవసరం లేదు. మాస్ మసాలా బిర్యానీ లాంటిది. మధ్యాహ్నం లేదా రాత్రి క్రమం తప్పకుండా ఉండాల్సిందే. కానీ ప్రయోగాలు మిలెట్స్ లాంటివి. ఆరోగ్యం కోసం తినాల్సిందే తీయాల్సిందే.