Ravi-Teja“టచ్ చేసి చూడు” రిలీజ్ కు ముందు ప్రమోషన్ లో భాగంగా, మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో హీరో రవితేజ ఓ విషయాన్ని స్పష్టం చేసారు. “నేను ఇంకా ప్రయోగాత్మక సినిమాలలో నటించను, అలాంటి సినిమాలలో చేస్తే ప్రేక్షకులు ఆదరించలేదు, తన నుంచి కమర్షియల్ సినిమాలు మాత్రమే ఆశిస్తున్నారు, కనుక తాను కమర్షియల్ స్క్రిప్ట్ లే చేస్తానంటూ” స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఫుల్ కమర్షియల్ బొమ్మగా విడుదలైన “టచ్ చేసి చూడు” పరిస్థితి ఏంటి? అంటే రవితేజ నోరెళ్ళబెట్టాల్సి వస్తోంది.

ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాల డిజాస్టర్స్ జాబితాలోకి ‘టచ్ చేసి చూడు’ కూడా చేరడం ఖాయమైన నేపధ్యంలో… రవితేజ సరికొత్త కధలను ఎంపిక చేసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. మాస్ మహారాజా చెప్పినట్లు… బహుశా తను చేసిన ప్రయోగాత్మక సినిమాలు విఫలమై ఉండొచ్చు, అయితే ప్రయోగాత్మక సినిమాలతో పాటు, రవితేజ నటించిన చాలా కమర్షియల్ బొమ్మలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్న వైనాన్ని రవితేజ మరిచినట్లున్నారు.

ఇంత చిన్న లాజిక్ ను రవితేజ ఎలా మరిచిపోయారో మరి! ముఖ్యంగా ‘టచ్ చేసి చూడు’ సినిమాలో రవితేజ నటనలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం విమర్శల పాలయ్యింది. ఫిట్ గా ఉండాలని చూసిన రవితేజ లుక్ కూడా ఏ మాత్రం ఆకట్టుకోని విధంగా ఉండడం అనేది అభిమానులకు కూడా జీర్ణించుకోలేని అంశంగా మారింది. దీంతో రాబోయే చిత్రాలలో అయినా రవితేజ కొత్తగా కనపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొత్తగా కనపడడమే కాదు, సరికొత్త స్క్రిప్ట్ లను కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే… గతంతో పోలిస్తే… ప్రేక్షకుల తీరులో చాలా మార్పులు వచ్చాయి.