Ravi Teja rejectected to give blood and nail samplesమాస్ మహారాజా రవితేజ సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు రోజు రాత్రి సమయంలో… ఆయన తల్లి రాజ్యలక్ష్మి మీడియా ముఖంగా తన కొడుకు పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యం మాదిరి బయటకు వస్తాడని, అధికారులు ఎలాంటి బ్లడ్ టెస్ట్ లైనా చేసుకోవచ్చని, రవితేజ అందుకు సహకరిస్తాడని కీలక ప్రకటనలు చేసారు. దీంతో ఛార్మి నుండి మొదలైన కొత్త ట్రెండ్ కు రవితేజ శుభంకార్డు వేస్తారని అంతా భావించారు.

చివరకు జరిగింది ఏమిటంటే… విచారణలో భాగంగా తుది దశలో భాగంగా బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళు ఇవ్వాలని కోరగా అందుకు రవితేజ, ప్రస్తుతం ఇవ్వలేనని, ఆలోచించి తర్వాత చెప్తానని సదరు అంశాన్ని దాటవేసినట్లుగా తెలుస్తోంది. ఓ పక్కన రవితేజ తల్లేమో తన తనయుడు ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం అని ప్రకటించడం… కానీ రవితేజ పరీక్షలకు అంగీకరించకపోవడంతో, సదరు అంశం హైలైట్ అయ్యింది. మరి ఈ పరిణామాలు ప్రేక్షకులలో, అభిమానులలో రవితేజ పట్ల ఎలాంటి సంకేతాలను తీసుకువెళ్తుంది?

అయితే ముందు రోజు రాత్రి ఓ స్టార్ హోటల్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక 9 గంటల పాటు సాగిన సిట్ విచారణలో దాదాపుగా 100 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. తన సోదరుడు భరత్ కు గంజాయి సేకరించే అలవాటు ఉండొచ్చు గానీ, కొకైన్ వంటి మత్తు పదార్ధాల జోలికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పినట్లుగా సమాచారం. కెల్విన్ తో తనకు పరిచయం ఉందని అంగీకరించిన రవితేజ, జిషన్ ఎవరో తెలియదని, వారి కాల్ డేటాలో తన నెంబర్ ఎందుకు ఉందో తెలియదని చెప్పినట్లుగా… మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి.