Ravi Teja ready to give blood samplesబ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళు వంటివి ఇచ్చేది లేదని సిట్ అధికారులకు తెగేసి చెప్పిన హీరోయిన్ ఛార్మి గురించి తెలిసిన విషయమే. ముందుగా పూరీ జగన్నాధ్, తరుణ్ వంటి వారు సిట్ కోరిన విధంగా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ళు వంటివి ఇచ్చి సహకరించగా, ఛార్మి ఉదంతం తర్వాత ఈ అంశం హైలైట్ అవుతోంది. మరి నేడు సిట్ విచారణకు హాజరు కాబోతున్న ‘మాస్ మహారాజా’ రవితేజ ఏం చేయబోతున్నారు? అధికారులు అడిగితే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమా? అంటే…

అవుననే అంటున్నారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి. తన కొడుకుకు ఎలాంటి పాపం తెలియదని, ఏ చెడు అలవాట్లు లేవని కితాబిచ్చిన రాజ్యలక్ష్మి, ఎలాంటి పరీక్షలకైనా రవితేజ సిద్ధమని స్పష్టం చేసారు. ఏవైనా కుట్రలు జరిగితే తప్ప, తమ కుమారుడు తప్పు చేసినట్లుగా ఎవరూ నిరూపించలేరని పూర్తి విశ్వాసం వ్యక్తం చేసారు. విచారణలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడని, టెస్ట్ ల కోసం దేనికైనా సిద్ధమని, తన కొడుకు నిప్పు లాంటి వాడని, ఏ అలవాట్లు లేని తన కుమారుడి పట్ల తమకు భయం ఎందుకని అన్నారు.

దీంతో సిట్ అధికారుల విచారణకు రవితేజ మానసికంగా సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. విచారణ ఎదుర్కొనే విషయంపై న్యాయవాదులతో కూడా రవి సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. పూరీ కేంద్రంగానే రవితేజపై ప్రశ్నల వర్షం ఉంటుందని మీడియా వర్గాలలో వెల్లడవుతున్న టాక్. ఒక రకంగా చెప్పాలంటే… రవితేజ హీరోగా కావడానికి, నిలబడడానికి కూడా పూరీనే కారణం. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ ద్వారా పరిచయం చేసిన పూరీ, ‘ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాలతో ఇండస్ట్రీలో రవితేజను హీరోగా నిలబెట్టాడు.