Ravi Teja Drugsడ్రగ్స్ కేసులో ‘సిట్’ అధికారుల నుండి నోటీసులు అందుకున్న ‘మాస్ మహారాజా’ రవితేజ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇవే నోటీసులు అందుకున్న ఇతర సెలబ్రిటీలు మాత్రం మీడియా ముందుకు వచ్చి, ఇందులో తమ ప్రమేయం లేదని, ఇదే విషయాన్ని సిట్ అధికారులకు వివరణ ఇచ్చుకుంటామని, తాము ఎలాంటి తప్పులు చేయలేదని, తమ భావాలను పంచుకున్న విషయం తెలిసిందే. అయితే అసలు రవితేజ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు?

ఇటీవల తన సోదరుడు భరత్ సంతాప సభకు హాజరైన సమయంలో… మీడియా నుండి పలు ప్రశ్నలను ఎదుర్కొన్న రవితేజ, వాటికి సరైన విధంగా జవాబు చెప్పడంలో విఫలమయ్యాడు. అంతేగాక సదరు మీడియా సమావేశాన్ని అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోవడం మరియు రవితేజ బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో, మొత్తం మీడియా వర్గాలన్నీ రవితేజను దుమ్మెత్తిపోసిన వైనం తెలిసిందే. దీంతో మరోసారి మీడియా ముందుకు రావాలంటే రవితేజ భయపడుతున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదే విషయంపై రవితేజ సన్నిహితుడు మరియు ఫ్యామిలీ డాక్టర్ అయిన కడియాల రాజేంద్ర తాజాగా ఓ మీడియా ఛానల్ ద్వారా తెలిపారు. అవుట్ డోర్ లో షూటింగ్ ఉండడం వలనే రవితేజ మీడియా ముందుకు రాలేదని, అయితే అసలు రవితేజపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇలా జరుగుతున్న వదంతులతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. భరత్ అంత్యక్రియల విషయంలోనూ రవితేజను మీడియా తప్పుగా చిత్రీకరించిందని, ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని ఈ సందర్భంగా కోరారు.

రవితేజ సోదరుడు భరత్ గురించి కూడా చెప్తూ… యాక్సిడెంట్ అయిన రోజున భరత్ మద్యం సేవించి లేరని, అలాగే గతంలో డ్రగ్స్ కేసులో భరత్ పట్టుబడిన మాట వాస్తవమే గానీ, ఆ తర్వాత నుండి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటున్నారని, పూర్తిగా మారిపోయాడని, నిజానిజాలు బయటకు వచ్చేవరకు మీడియా కాస్త సంయమనం పాటించాలని కోరారు. మొత్తమ్మీద రవితేజ నేరుగా చెప్పాల్సిన మాటలను, మీడియా వర్గీయుల ప్రశ్నలకు భయపడి, ఈ డాక్టర్ ద్వారా పలికించారన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.