Ravi Teja Cameo Role పెద్ద స్టార్ హీరో క్యామియో వల్ల సినిమాలకు ఎంత మేరకు ఉపయోగం ఉంటుందనేది ఆ కథ మీద సదరు ఆర్టిస్టు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పెదరాయుడుని రజనీకాంత్ లేకుండా ఊహించుకోలేం. ఒరిజినల్ వెర్షన్ నాట్టమైలో ఇదే పాత్ర విజయ్ కుమార్ చేస్తే తెలుగులో వచ్చిన ఇంపాక్ట్ సగం కూడా ఫీల్ కాలేం. ఇదే సూపర్ స్టార్ జగపతిబాబు కథానాయకుడులో పొడిగించిన అతిథిగా నటిస్తే సక్సెస్ కాలేకపోయింది. సో విషయం అర్థమయ్యిందిగా. చిరంజీవి ఇటీవలి కాలంలో స్క్రిప్ట్ లు డిమాండ్ చేస్తున్నాయనో లేక మరో కారణమో తెలియదు కానీ మొత్తానికి ఈ మధ్యకాలంలో ఇతర హీరోలతో క్యామియోలు తప్పనిసరై చేయించాల్సి వస్తోంది.

ఆచార్యలో రామ్ చరణ్ ఎంతమాత్రం ప్రభావం చూపించకపోగా రివర్స్ లో తనకే అది పెద్ద మైనస్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఇంత పెద్ద డిజాస్టర్ లో భాగం కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. స్వయానా తండ్రి సినిమానే అయినా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్లు ఉన్నా పధ్నాలుగు చిత్రాల కెరీర్లో ఆల్రెడీ ఉన్న మెగా ఫ్లాపులకు ఇది తోడవ్వడం ఎంతైనా బాధ కలిగించే విషయం. ఇక దర్శకుడు మోహన్ రాజా అదే పనిగా బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ కు ఒరగబెట్టిందేం లేదు. ఏదో నార్త్ లో భీకరమైన ఓపెనింగ్స్ తెస్తాడనుకుంటే అసలు ఎవరూ పట్టించుకోలేదని కలెక్షన్లు రుజువు చేశాయి.

పైపెచ్చు గాడ్ ఫాదర్ అతి పెద్ద మైనస్సుల్లో ఈ సల్మాన్ పాత్రతో పాటు తార్ మార్ థక్కర్ మార్ పాట చోటు సంపాదించుకున్నాయి. ఇప్పుడు వాల్తేర్ వీరయ్య వంతు వచ్చింది. ఇరవై సంవత్సరాల తర్వాత మాస్ మహారాజా రవితేజ మళ్ళీ చిరంజీవితో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నాడు. ఇద్దరి ఫ్యాన్స్ కి ఇది మాములు కిక్ కాదు. సవతి అన్నదమ్ములుగా ఇందులో ఈ బ్రదర్స్ చేయబోయే రచ్చని దర్శకుడు బాబీ ఎలా చూపించి ఉంటాడనే ఆసక్తి సగటు ప్రేక్షకుల్లో మాములుగా లేదు. ఏదో ఐదు పది నిముషాలు కాకుండా అరగంట పైనే ఓ పాటతో సహా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉండటం చిరంజీవి ఫ్లాప్ సెంటిమెంట్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

అంచనాలకు బిజినెస్ కు రవితేజ కాంబినేషన్ చాలా హెల్ప్ అవుతోంది. ఎటొచ్చి ఈసారి తన క్యామియో బలంగా పనిచేస్తేనే మెగాస్టార్ మీద సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ కి చెక్ పెట్టినట్టు అవుతుంది. అసలే వీరసింహారెడ్డి, వారసుడు, తునివులతో పోటీ మాములుగా లేదు. బాగుందని కాదు అదిరిపోయిందనే టాక్ వస్తేనే వీరయ్య నిలబడతాడు. అసలే అందరికంటే చివరిగా జనవరి 13 రాబోతున్నట్టు ట్రేడ్ లో టాక్ ఉంది. అదే నిజమైతే ముందొచ్చే మూడింటి కంటే మెగా మూవీ బాగుందనే మాట బయటికి తెచ్చుకోవాలి. అది చిరంజీవితో పాటు బాబీ, రవితేజ, దేవిశ్రీ ప్రసాద్ భుజాల మీద ఉంది. చూడాలి మరి ఈ త్రయం ఏం చేయనుందో.