ravi-k-chandran-dream-to-work-with-mahesh-babuటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో కనీసం ఓ సినిమా చేయాలన్న ఆకాంక్షను టాప్ దర్శకులే కాదు, దేశంలోని పలువురు సాంకేతిక నిపుణులు కూడా వ్యక్తపరిచారు. ఆ జాబితాలోని ఒకరే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్. తమిళనాడుకు చెందిన ఈ సాంకేతిక నిపుణుడు ప్రిన్స్ మహేష్ బాబుకు తానూ అభిమానిని, భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయాలన్న అభిప్రాయాన్ని 2011లో వెలిబుచ్చాడు. అయితే ఆ కోరిక తాజా సినిమాతో నెరవేరుతుండడం విశేషం.

ఈ నెల 9వ తేదీన ప్రారంభం కాబోతున్న కొరటాల శివ – మహేష్ బాబుల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రవి కే చంద్రన్ బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో, నాటి అభిలాష నేటికి కార్యరూపం దాల్చింది. అయితే మహేష్ చేసిన ఇంటెక్స్, ధమ్సప్ అడ్వర్ టైజ్మెంట్ లకు ఇప్పటికే వీరిద్దరి కాంభినేషన్ లో రూపొందాయి. తమిళంలో మణిరత్నం, మురుగదాస్ వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలను పని చేసిన రవికి బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు చేసిన అనుభవం ఉంది. ఈ ఏడాదిలో విడుదలైన కత్రీనా కైఫ్ నటించిన ‘బార్ బార్ దేఖో’ సినిమాకు కూడా రవినే సినిమాటోగ్రాఫర్.

అలాగే అంతకు ముందు ‘మై నేమ్ ఈజ్ ఖాన్, గజినీ, రబ్ నే బనా ది జోడి, సావరియా, ఫనా, బ్లాక్, కోయి మిల్ గయా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో ఇండియాలోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా రవి కే చంద్రన్ పేరు మారుమ్రోగింది. తన సినిమాలకు ఫోటోగ్రఫీ విషయంలో కొరటాల శివ సెలక్షన్ ఎప్పుడూ ది బెస్ట్ గా ఉంటుందని తొలి మూడు చిత్రాలు చెప్పకనే చెప్పాయి. దీంతో తాజా సినిమాకు కూడా అత్యున్నత సాంకేతిక నిపుణుడినే ఎంపిక చేసుకోవడం విశేషం.