ravela-kishore-babu-resigned-from-janasena-partyఇటీవలే జరిగిన ఎన్నికలలో ఘోరపరాజయం మూటగట్టుకున్న జనసేన పార్టీకి మొదటి షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కనీసం డిపాజిటు కూడా దక్కించుకోలేకపోయారు.

విజేత వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి 91 వేల పైచిలుకు ఓట్లు, రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్ధికి 84 వేల పైచిలుకు ఓట్లు రాగా కిషోర్ బాబు కు కేవలం 26 వేల ఓట్లు వచ్చాయి. ఆ తరువాత జరిగిన పార్టీ సమీక్షా సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. అయితే పార్టీకి రాజీనామా చేసే సందర్భంగా రావెల ఎటువంటి ఆరోపణలు చెయ్యలేదు. అది జనసైనికులకు ఊరటనిచ్చే అంశమే. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు.

గత మూడు రోజులుగా మంగళగిరి పార్టీ ఆఫీసులో జరుగుతున్న జనసేన సమీక్షా సమావేశాలకు ముఖ్య నేతలు – నాదెండ్ల మనోహర్, జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీనితో ఏ నిముషంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని జనసైనికులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఓటమి నుండి కోలుకముందే ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ ఎన్నికలు తొందరగా నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. ravela-kishore-babu-resigned-from-janasena-party