Veyyinokka-Ravanasuraక్లాసిక్ సాంగ్స్ కి ఎప్పటికైనా ఒక విలువుంటుంది. వాటిని ఒరిజినల్ వెర్షన్ లో వింటేనే ఆ అనుభూతిని ఆస్వాదించగలం. కేవలం ట్రెండ్ పేరుతో వాటిని రీమిక్స్ చేయించినంత మాత్రాన అదే మేజిక్ రిపీట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ టాలీవుడ్ దర్శకులు మాత్రం క్రమం తప్పకుండా వీటిని ట్రై చేయడం, పదే పదే ఫెయిలవ్వడం నిత్య ప్రక్రియగా మారిపోయింది. రవితేజ రావణాసుర నుంచి వెయ్యినొక్క జిల్లాల వరకు అనే సాంగ్ ని ఫ్రెష్ గా రిలీజ్ చేశారు. ఇది ఎప్పుడో 1992లో వచ్చిన వెంకటేష్ సూర్య ఐపిఎస్ లోని మంచి హుషారైన పాట. సినిమా అంతగా ఆడలేదు కానీ ఇళయరాజా ఆడియో పెద్ద హిట్టు.

ఎస్పి బాలు గాత్రంలో టీజింగ్ పదాలతో సీతారామశాస్త్రి ఎంతో గొప్పగా రాశారు. ఇప్పుడు విన్నా క్రేజీగా అనిపిస్తుంది. దాన్ని ఎన్ని రకాలుగా ఖూనీ చేయాలో అంతా చేశారని అనురాగ్ కులకర్ణి లాంటి టాలెంటెడ్ సింగర్ కూడా న్యాయం చేయలేకపోయాడని రాజా ఫ్యాన్స్ వాపోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సగం అంచనాలు కూడా అందుకోలేకపోయాడు. అమిగోస్ లో ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదీ వెన్నెలమ్మతో గిబ్రాన్ మెప్పించలేకపోయాడు. బాలకృష్ణ ధర్మక్షేతంలో ఎవర్ గ్రీన్ సాంగ్ ఇలా చేతులారా వృధా చేసేశారు. వీటిలో హీరోల తప్పుందని అనలేం. దర్శకుల ఆలోచనలే ఇవి.

నాయక్ లో శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడోని తమన్ అంతటివాడే సోసోగా రీ క్రియేట్ చేశాడు. రచ్చలో వానా వానా వెల్లువాయేని తమన్నా అందాలు కాపాడాయి కానీ ఇప్పటికీ గ్యాంగ్ లీడర్ లో చిరు విజయశాంతిల గీతం ముందు దిగదుడుపే. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యముడికి మొగుడులో అందం హిందోళం ఐకానిక్ సాంగ్ ని తడుముకుని కేవలం మెగా ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించగలిగాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో ఖైదీ నెంబర్ 786 గువ్వా గోరింకని సైతం వదల్లేదు. పటాస్ లో రౌడీ ఇన్స్ పెక్టర్ పాటను వాడుకున్న సంగతి వీరాభిమానులే మర్చిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి

స్వర్గీయ ఎన్టీఆర్ ఆకుచాటు పిందె తడిసె, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి పాటలదీ ఇదే కథ. మంచి ట్యూన్లు ఇవ్వలేని క్రియేటివిటీ లోపమో లేక కల్ట్ క్లాసిక్స్ తాలూకు క్రేజ్ ని వాడుకునే తాపత్రయమో ఏమో కానీ ఇలాంటి ప్రయత్నాలు అన్నీ బెడిసి కొడుతున్నాయి తప్పించి అసలువాటికి కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఒకవేళ నిజంగా అంతగా వాడుకోవాలనిపిస్తే శుభ్రంగా ఒరిజినల్ ట్రాక్స్ ఆయా నిర్మాతలు సంగీత దర్శకుల అనుమతితో పెట్టేసుకోవడం ఉత్తమం. అంతే తప్ప జియో సావన్ లో యుట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయని ఇలా రీమిక్స్ పేరుతో వాడేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి.