మేడమ్ సార్... మేడమ్ అంతే..!‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండ చేత ‘మేడమ్ మేడమ్’ అంటూ ముద్దుగా పిలిపించుకున్న రష్మిక, ప్రస్తుతం “పుష్ప” ఈవెంట్స్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంటోంది. బుధవారం నాడు బెంగుళూరు మరియు కొచ్చిల వేదికగా జరిగిన ఈవెంట్స్ లో తన అందచందాలతో క్యూట్ లుక్స్ తో ఫ్యాన్స్ ను పడేస్తోంది.

ముఖ్యంగా కొచ్చి ప్రెస్ మీట్ అయితే రష్మికనే హైలైట్ అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు. సాంప్రదాయ గాగ్రాచోళి కాస్ట్యూమ్స్ లో రష్మిక ప్రదర్శించిన హావభావాలు యువత హృదయాలను కొల్లగొట్టాయి. అలాగే ట్రెడిషనల్ వేర్ లో కూడా అందాల ప్రదర్శనకు లోటు లేకుండా చేసిన పిక్స్ సోషల్ మీడియాను కమ్మేశాయి.

గడిచిన కొన్ని గంటలుగా కొచ్చిలో రష్మిక పాల్గొన్న ఫోటోలే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో సందడి చేస్తున్నాయి. మరి పక్కనే ఉన్న అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? అంటే… ఎలాగూ ‘అలా వైకుంఠపురం’లో పూజా హెగ్డేను అభివర్ణిస్తూ చెప్పిన డైలాగ్ ఉంది కదా… “మేడమ్ సార్… మేడమ్ అంతే…” అనుకోవడమే!

ప్రస్తుతం వేదిక ముంబైకి మారినా రష్మిక హంగామాలో పెద్ద తేడా లేదు. తొలిసారిగా ఉత్తరాదిలో అడుగు పెట్టిన బన్నీకి బాలీవుడ్ ఘనస్వాగతం పలుకగా, స్టేజ్ పైన ‘సామి’ పాటకు స్టెప్పులు వేసి మరోసారి మీడియా కన్నులను తన వైపుకు తిప్పుకుంది ఈ ‘నేషనల్ క్రష్.’ ప్రస్తుతం ఈ స్టెప్పుల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.