rapes-adda-bengaluru-vs-delhiమహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న నగరాలలో దేశంలోనే మొదటి స్థానంలో రాజధాని ఢిల్లీ ఉందన్న విషయం ఇటీవల వెలువడిన సర్వేలు స్పష్టం చేసాయి. బహుశా అదే స్థాయిలో అభివృద్ధి కావాలని బెంగుళూరు కూడా ప్రయత్నిస్తుందేమో గానీ, ఇటీవల కాలంలో బెంగుళూరు వేదికగా జరుగుతున్న అఘాయిత్యాలకు కొదవ లేకుండా పోతోంది. మొన్నటికి మొన్న అర్ధరాత్రి సమయంలో సాధారణ మహిళలపై అకృత్యాలు చేస్తూ సీసీ కెమెరాలకు పలువురు నిందితులు చిక్కారు. వీరిపై చర్యలు ఎలా ఉన్నాయో, ఏమయ్యాయో తెలియదు గానీ, తాజాగా అయితే ఏకంగా సినీ సెలబ్రిటీల మీదే ఈ దారుణానికి ఒడిగట్టారు.

సోమవారం నాడు బెంగుళూరులో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు నగరంలోని మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేస్తోంది. 23 ఏళ్ళ ప్రముఖ కన్నడ వర్ధమాన నటిపై ఇద్దరు యువకులు ‘ఈ రాత్రికి మాతో గడుపుదు రా…’ అంటూ బలవంతంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు. సినిమా షూటింగ్ లో పాల్గొని హెగ్గనహళ్లి వద్ద క్యాబ్‌ దిగి ఇంటికి వెళ్తున్న సినీ నటిని సచిన్‌, ప్రవీణ్‌ అలియాస్‌ పుట్ట అనే ఇద్దరు యువకులు అడ్డగించి, ఆమెను లాక్కుపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దుర్భాషలాడి, దాడి చేసి పరారయ్యారు.

ఆ ఇద్దరితో సదరు నటికి మూడేళ్లుగా పరిచయం ఉందని, వారి వేధింపులతో గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశానని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆమె తమకు నగదు బాకీ ఉందని, తాము అడగడంతో తమపై ఆరోపణలు చేస్తోందని వారిద్దరూ చెబుతున్నారు. ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ మహిళపై జరిగిన అకృత్యం కాగా, బెంగుళూరు వేదికగానే మరో ఘటనలో ఓ యువ గాయనిపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు.

సోమవారం నాడు రాత్రి 2.30 గంటల సమయంలో విధులు ముగించుకుని ఓలా క్యాబ్ లో తన ఇంటికి బయలుదేరింది. అయితే వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో క్యాబ్ వెళ్లడాన్ని ఓలా యాప్ ద్వారా గుర్తించింది. అప్పటికే క్యాబ్ ఓ నిర్జన ప్రదేశానికి చేరుకోవడంతో డ్రైవర్ తో పెనుగులాడి అతని బారి నుంచి తప్పించుకుంది. సమీపంలో ఉన్న ఓ మెడికల్ క్లినిక్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి తన స్నేహితుడికి ఫోన్ చేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు.

నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అదనపు పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాల్కర్ తెలిపారు. అలాగే క్యాబ్ డ్రైవర్ ను విధుల నుంచి తొలగించామని ఓలా సంస్థ ప్రకటించింది. కాస్త జనజీవనంలో తిరుగుతూ, ప్రస్తుత టెక్నాలజీని వినియోగించే యువతుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏం కాను? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాలలో మహిళలు నిర్వహిస్తున్న విధులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇలాగే మహిళలపై అఘాయిత్యాలు కొనసాగితే… ఢిల్లీ కంటే ముందు స్థానంలోనే బెంగుళూరు నిలిచే అవకాశాలు ఉన్నాయి.